https://oktelugu.com/

Ramadan 2024: పవిత్ర రంజాన్ మాసంలో.. నోరూరించే ఈ వంటకాలను ఓ పట్టు పట్టండి..

ముస్లింలు అమితంగా ఇష్టపడే వంటకంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. నేరేడు పండు గుజ్జుతో దీనిని తయారు చేస్తారు. రంజాన్ ఉపవాస సమయంలో దీనిని ముస్లింలు ఎక్కువగా తింటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 31, 2024 / 11:03 AM IST

    Ramadan 2024

    Follow us on

    Ramadan 2024: పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలు రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూట ఇఫ్తార్ సమయంలో ఉపవాసాన్ని విడుస్తారు. మరుసటి రోజు ఉదయం కూడా సహర్ సమయంలో ఉపవాసాన్ని విడిచి ఆహారం తీసుకుంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండే ముస్లింలు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటారు. ముస్లింలు మాత్రమే కాదు ముస్లిమేతరులు కూడా ఆ వంటకాలను ఇష్టపడుతుంటారు. ఇంతకీ ఆ వంటకాలు ఏంటంటే..

    షీర్ ఖుర్మా..

    నోటికి తగిలే యాలకులు, టెస్టింగ్ బడ్స్ ను మరింత ఉత్తేజితం చేసే సుగంధ ద్రవ్యాలు.. నాలుకకు అద్భుతమైన తీపిని తగిలించే పాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రుచుల సమ్మేళితం ఈ వంటకం. ఈద్ ఉల్ ఫీతర్, ఈద్ ఉల్ అదా వంటి ప్రత్యేకమైన పండుగల సందర్భాల్లో ఈ వంటకాన్ని ముస్లింలు తయారు చేసుకుంటారు. పాలు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, పచ్చిమిర్చి తో ఈ వంటకాన్ని తయారు చేస్తారు.

    ఖుర్బానీ

    ముస్లింలు అమితంగా ఇష్టపడే వంటకంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. నేరేడు పండు గుజ్జుతో దీనిని తయారు చేస్తారు. రంజాన్ ఉపవాస సమయంలో దీనిని ముస్లింలు ఎక్కువగా తింటారు. అనేక రకాల పోషకాల సమ్మేళితమైన ఈ వంటకం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుందని ముస్లింలు నమ్ముతుంటారు. రంజాన్ సమయంలోనే కాదు వివాహ వేడుకల్లో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారుచేస్తుంటారు.

    గులాబ్ పిర్ని

    ఈ వంటకం జమ్మూ కాశ్మీర్, ఉత్తర భారత రాష్ట్రాలలో ఎక్కువగా లభిస్తుంది. మెత్తగా ఉడికించిన అన్నం, చిక్కటి పాలు, బెల్లం, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి వాటి మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. కుంకుమ పువ్వు వేయడం ద్వారా ఈ వంటకానికి ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది.

    నేతి సేమియా

    సేమ్యాలను నేతిలో వేయించి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్స్, మరిగించిన పాలు, పంచదార మిశ్రమంతో తయారుచేసిన ఈ వంటకమంటే ముస్లింలు అమితంగా ఇష్టపడుతుంటారు.

    మాల్పువా

    గుడ్లు, మైదాపిండి, పాలమీగడ, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. ఇది ఒక రకంగా కేక్ లాగా ఉంటుంది. ఉపవాసం ముగించిన తర్వాత ముస్లింలు దీనిని ఆరగిస్తారు. ఇది తక్షణ శక్తి ఇస్తుందని నమ్ముతుంటారు.

    ఖజుర్ హల్వా

    ఖర్జూర పండ్లతో ఈ హల్వాను తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇతర సుగంధ ద్రవ్యాలతో ఈ హల్వాను తయారు చేస్తారు. మధుమేహం ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. కొన్ని ప్రాంతాలలో చక్కరకు బదులు బెల్లం కూడా వేస్తారు..

    షాహి తుక్డా

    మరిగించిన పాలు, నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో కొన్ని రొట్టె ముక్కలను వేస్తారు. ఆ రొట్టె ముక్కలు ఆ సారాన్ని మొత్తం పీల్చి ఉబ్బుతాయి. దీనిని షాహీ తుక్డా అని పిలుస్తుంటారు. వివాహాల సమయంలోనూ ఈ వంటకాన్ని తయారు చేస్తుంటారు.

    కేసర్ కుల్ఫీ

    కుల్ఫీ అనేది పర్షియన్ పదం. ఈ వంటకం 16వ శతాబ్దం నాటిదట. బాదం, సుగంధ ద్రవ్యాలు, పాల మిశ్రమంతో దీనిని తయారుచేసి. ఒక ప్రత్యేకమైన ఆకృతి గల పాత్రలో పోసి.. ఆ మిశ్రమాన్ని మైనస్ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు. ఆ ఉష్ణోగ్రత వద్ద అది గడ్డ కడుతుంది. అనంతరం దానిని ఉపవాసం ముగించిన తర్వాత తింటారు.

    ఈ వంటకాలను కేవలం ముస్లింలు మాత్రమే కాదు.. ముస్లిమేతరులు కూడా ఇష్టంగా తింటారు. రంజాన్ సమయంలో పెద్దపెద్ద హోటల్స్ ఈ వంటకాలతో ప్రత్యేకమైన మెనూ ఏర్పాటు చేస్తాయి.. ముఖ్యంగా హైదరాబాదులోని పాత బస్తి ప్రాంతాల్లో ఈ వంటకాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ రంజాన్ సమయంలో తప్ప మిగతా సమయాల్లో పెద్దగా ఈ వంటకాలు లభించవు. అందువల్ల ఈ రంజాన్ సమయంలో ఈ వంటకాలను పట్టుపడితే… శక్తికి శక్తి.. నాలుకకు సరికొత్త రుచి లభిస్తుంది.