Puri Ratna Bhandar : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.ఏటా జగన్నాథ రథయాత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లక్షలాదిమంది భక్తుల జయ జయ ధ్వనాల నడుమ యాత్ర ముందుకు సాగుతోంది. ఈ యాత్రలో ప్రతిఘట్టం అద్భుతమే. రథం కదిలించిన నాడు వరుణుడు తప్పకుండా కరుణ చూపుతాడు. వర్షం కురుస్తుంది. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. పూరి జగన్నాధుడికి సుదీర్ఘ చరిత్ర ఉంది. విలువైన ఆస్తులు సైతం ఉన్నాయి. అక్కడ రత్న భాండాగారంలో స్వామి వారి విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు దాచిపెట్టారు. దాదాపు 46 సంవత్సరాలు తర్వాత రేపు ఆ భాండాగారాన్ని తెరవనున్నారు. ఇటీవల ఒడిస్సా ఎన్నికల్లో దీనినే ప్రచారాస్త్రంగా చేసుకుంది బిజెపి. జగన్నాథుడి రత్న భాండాగారం తెరిపించడంలో నవీన్ సర్కార్ విఫలమైందని ఆరోపణలు చేసింది. ఒడిస్సా ప్రజలు కూడా దీనిని బలంగా నమ్మారు. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బిజెపి అధికారంలోకి రాగలిగింది. అందుకే హామీ మేరకు రత్న భాండాగారాన్ని తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది.
గతంలో మూడేళ్లకు, ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో ట్రెజరీలోని వజ్రాభరణాలను లెక్కించి భాండాగారం సీజ్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆ గదిని తెరవలేదు. అప్పట్లో ఆభరణాలను వెల కట్టలేక పక్కన పెట్టారని.. గది తాళం దొరకడం లేదని.. ఇలా లేనిపోని వివాదాలు రేగాయి. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కీలక అంశంగా మారింది. అందుకే దీనికి పుల్ స్టాప్ పెట్టాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 14న భాండాగారం తెరిచేందుకు ముహూర్తంగా నిర్ణయించింది.
1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. లెక్కింపు తర్వాత ప్రకటించిన జాబితాలో స్వామివారికి చెందిన పలు ఆభరణాల పేర్లు కనిపించలేదు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. న్యాయస్థానం భాండాగరాన్ని తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించింది. ఈ క్రమంలో ఆభరణాల లెక్కింపు, గది మరామ్మతుల కోసం 2019లో నవీన్ పట్నాయక్ సర్కారు 13 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 16న భాండాగారం తలుపులు తెరిచేందుకు వెళ్లిన ఈ కమిటీ సభ్యులకు.. తాళం చెవి కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. అయితే డూప్లికేట్ తాళం చెవి పూరీ కలెక్టరేట్లో ట్రెజరీ లో ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ తాళం చెవి సాయంతో గది తలుపులు తెరవనున్నారు.
46 సంవత్సరాల తర్వాత ఈ రహస్యగది తెరవనుండడంతో లోపల కింగ్ కాబ్రాలు వంటి భారీ సర్పాలు ఉంటాయనే భయం మాత్రం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత ఈ భాండాగారం తెరవనుండడంతో సర్వత్రా ఇదే హాట్ టాపిక్ గా మారింది.
నాలుగు దశాబ్దాల తర్వాత ఈ భాండాగరం తెరుచుకోనుండడంతో దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఆ గదిలోపల ఐదు కర్ర పెట్టెల్లో ఆభరణాలు దాచి ఉంచారు. వాటి పరిస్థితి ఏంటి? ఎంత విలువ ఉంటుంది? ఎలా లెక్కిస్తారు? బయటకు ప్రకటిస్తారా? మీడియా ముందు పెడతారా? అన్న విషయాలపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. రేపటితో అనుమానాలన్నీ పటాపంచలు కానున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Puri ratna bhandar of jagannath temple of puri in odisha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com