Pithru Pakshalu : హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులను ప్రత్యేకంగా భావిస్తాయం. ఈ రోజుల్లో పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసంలో దాదాపు ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం తరువాత వచ్చే భాద్రపదంలో పక్షం రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగతా 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. పితృ అంటే తండ్రి. అంటే ఒక కుటుంబంలో మరణించిన పెద్దలను గుర్తు చేసుకుంటూ వారి కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన పనులు చేస్తూ దాన ధర్మాలు చేస్తుంటారు. ఈ కాలంలో పూర్వీకులు భూమ్మీదకు వచ్చి తమ వాళ్లు తమ కోసం ఎటవంటి కార్యక్రమాలు చేస్తున్నారో గమనిస్తారట. అందుకే చాలా మంది ఈ రోజుల్లో తమ పెద్దల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పితృ పక్ష రోజుల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఒక ఇంట్లో మగవాళ్లు కొన్ని పనులకు దూరంగా ఉండాలని అంటున్నారు. అవేంటంటే?
భాద్రపదంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షాలు మొదలవుతాయి. ఆ తరువాత 15 రోజుల తరువాత మహాలయ అమావాస్యతో ఇవి పూర్తవుతాయి. 2024 ఏడాదిలో సెప్టెంబర్ 18 నుంచి పితృపక్షాలు మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు తమ పెద్దల కోసం కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక వ్యక్తి దేవతలను ఎంత ఆరాధించాలో.. అలాగే తమ పూర్వీకుల కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి వారి కుటుంబ సంక్షేమం కోసం ఆరాధిస్తారట. ఒక వ్యక్తికి తల్లిదండ్రులిద్దరూ మరణిస్తే వారు తప్పనిసరిగా పితృపక్షాల రోజుల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వారికి కావాల్సిన ఆహారం ఇతర వస్తువులను సమర్పించాలి.
దేవతకు నిర్వహించే పూజల సమయంలో ఎంత పవిత్రంగా ఉండాలో.. పితృపక్షాల సమయంలోనూ అంతే శ్రద్ధతో పూజలు నిర్వహించాలి. ఏదైనా ఒకరోజు పెద్దల కోసం కార్యక్రమం నిర్వహించాలనుకుంటే ఆరోజు ఉదయం నుంచే ఇంటిల్లిపాది శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తరువాత పండితులను పిలిపించుకొని వారి చేత పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ తరువాత పితృ దేవతలకు ఇష్టమైన ఆహారాన్ని అందించాలి. అయితే ఈరోజు ఎటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి.
ఇక పితృపక్ష కాలంలో ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. కొత్త వస్తువులు కొనుగోలును వాయిదా వేసుకోవాలి. జుట్టు కత్తిరించుకోకూడదు. దుస్తుల కోనుగోలును వాయిదా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అలాగే వంట పాత్రలను ఎక్కువగా ఇనుము లోహంతో కూడుకున్నవి ఉపయోగించకూడదు. ఇనుము నెగెటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. రాగి, ఇత్తడి వంటి పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే పితృదేవతలకు ఇష్టంలేని పనులు చేయకూడదు. ఒక్కసారి వారి ఆగ్రహానికి గురైతే ఏడాదంతా కష్టాలను ఎదుర్కొంటారు. పెద్దల కోసం నిర్వహించే కార్యక్రమం రోజున వారిని తలుచుకుంటూ ఉండాలి.