https://oktelugu.com/

Tirumala Laddu Prasadam : అసలు తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు ప్రారంభమైంది.. ఏ రాజు దీన్ని ప్రారంభించాడు.. చరిత్ర ఇదీ

ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత.. భక్తులు వెంటనే పరుగులు పెట్టేది తిరుమల లడ్డు కోసం.. ఆ. పోటు లోకి ప్రవేశించగానే నెయ్యి వాసన ఘుమఘుమలాడుతుంది. పచ్చ కర్పూరం, ఇతర దినుసులు ముక్కుకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 / 08:48 PM IST

    Tirumala Laddu Prasadam

    Follow us on

    Tirumala Laddu Prasadam :  కల్తీ పదార్థాలు వాడారు, జంతువుల కొవ్వు నుంచి తీసిన ద్రవాన్ని లడ్డుల తయారీ కోసం ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తిరుమల లడ్డూ గురించి మరోసారి ప్రస్తావన మొదలైంది. తిరుమల లడ్డూ అనేది అత్యంత పవిత్రమైనది. సంవత్సరంలో 365 రోజులు ఉంటే.. తిరుమల దేవస్థానంలో 400కు పైగా పండగలు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఈ క్షేత్రానికి వస్తూ ఉంటుంది. అందువల్ల స్వామివారి ప్రసాదానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంటుంది. పైగా తిరుమలలో ఎన్నో ప్రసాదాలు ఉన్నప్పటికీ లడ్డూ మాత్రమే భక్తులకు ప్రత్యేకంగా గుర్తుకు వస్తుంది.

    పల్లవుల కాలంలో..

    క్రీస్తుశకం 614లో పల్లవులు తిరుమల ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు.. పల్లవ రాణి “సమవాయి” తిరుమల శ్రీవారి ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. పంచ బేరాల్లో ఈ విగ్రహం ఒకటిగా ఉంది. ఆ కాలంలోనే స్వామివారికి పల్లవులు ప్రసాదం సమర్పించేవారు. ఆ కాలంలో భక్తులు తక్కువగా తిరుమలకు వచ్చేవారు. శ్రీ రామానుజాచార్యులు తిరుమలలో సందర్శించిన తర్వాత.. ఈ క్షేత్రం ప్రాశస్త్యం పెరిగింది.

    గ్రామాల విరాళం

    వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యానికి సంబంధించి రెండవ దేవరాయుల కాలంలో అమాత్య శేఖర మల్లన్న మూడు గ్రామాలను కానుకగా ఇచ్చారు. ఈ గ్రామాల ద్వారా వచ్చే ఆదాయంతో స్వామివారికి నిత్యం సేవలు జరిపేవారు. ఆ కాలంలో శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో ఒక పట్టిక రూపొందించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు “తిరుప్పొంగం” వితరణగా సమర్పించేవారు. తర్వాత కాలంలో “మనోహర పడి, సుక్కీయం, అప్పం”.. వంటి వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవారు. విజయనగరం సామ్రాజ్య అధిపతులు పరిపాలించిన కాలంలో “అవసరం” అనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదించేవారు.

    300 సంవత్సరాల క్రితం

    300 సంవత్సరాల క్రితం తిరుమలలో భక్తులకు తీపి ప్రసాదాన్ని ఇచ్చేవారు. 1803 బ్రిటిష్ పరిపాలకులు స్వామివారి ప్రసాదాన్ని విక్రయించాలని అప్పటి ఆలయ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ కాలంలో స్వామివారి వడలకు డిమాండ్ ఉండేది. అవి ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల భక్తులు వాటిని ఇష్టంగా తినేవారు. ఇక మహంతుల హయాంలో భక్తులకు “తీపి బూందీ” ప్రసాదంగా ఇచ్చేవారు. అనంతరం ఆ ప్రసాదాన్ని లడ్డుగా మార్చారు. 1940 లో మిరాశీ దార్లలో ప్రముఖుడైన కళ్యాణం అయ్యంగార్ భక్తులకు “లడ్డూ ప్రసాదాన్ని” ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రసాదానికి అప్పట్లో భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఫలితంగా “తిరుమల లడ్డూ” విశిష్టమైన ప్రసాదంగా మారిపోయింది.

    లడ్డూల్లో చాలా రకాలు

    తిరుమల ప్రసాదంలో భక్తులకు తెలిసిన లడ్డూలు రెండు మాత్రమే. భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేవస్థానం తరఫునుంచి ఒక లడ్డూ ఇస్తారు. మరొక లడ్డూ కావాలంటే రూ.50 కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకోటి కల్యాణోత్సవం లడ్డూ.. దీని ధర 2 దాకా ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఆస్థానం లడ్డూ అనేది మరొకటి ఉంటుంది. ముఖ్యమైన పండుగలు, రాష్ట్రపతి లాంటి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వీటిని రూపొందిస్తారు. వీటి బరువు 750 గ్రాముల దాకా ఉంటుంది. అయితే ఆస్థానం లడ్డూ విశిష్టమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తుంటారు.

    కొలతల ప్రకారం చేస్తారు

    తిరుమల లడ్డూ రూపొందించేందుకు ఉపయోగించే పదార్థాలను పక్క కొలతల ప్రకారం చేస్తారు.. ఇందుకోసం ప్రత్యేకమైన దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తంలో 51 లడ్డూలు ఉంటాయి. లడ్డూల తయారీకి శనగపిండి, చక్కెర, జీడిపప్పు, ఆవు నెయ్యి, కల కండ, యాలకులు, ఎండు ద్రాక్ష, పచ్చ కర్పూరం వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ఇక లడ్డూ ప్రసాదానికి 2009లో జీఐ(భౌగోళిక గుర్తింపు) లభించింది. తిరుమల లడ్డూకు పేటెంట్ హక్కు కూడా ఉంది.

    అందుకే అంత రుచి

    వెంకటేశ్వర స్వామిని కలియుగంలో “కలౌ వేంకటనాయక” సంబోధిస్తుంటారు. దీని ప్రకారం దేవదేవుడి ప్రసాదం ముందు సాటి వచ్చే పదార్థాలు ఏవైనా ఉంటాయా? అంటే ఉండవని అర్థం. ఎందుకంటే తిరుమల కొండల్లో ప్రవహించే నీరు ప్రత్యేకం. వాతావరణం ప్రత్యేకం. ఆలయంలో పోటు ప్రత్యేకం. అందువల్లే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ అత్యంత విశిష్టం.