TTD Naivedya : తిరుమలలో లడ్డూ ప్రసాదం కంటే ముందు వడను స్వామివారికి నివేదించేవారు. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవు కాబట్టి భక్తులు ఆ వడలతోనే ఆకలి తీర్చుకునేవారు. ఆ తర్వాత తీపి బూంది ప్రసాదం జాబితాలో చేరింది. 1940 నుంచి బూంది కాస్త లడ్డూగా మారింది. భక్తులకు ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న లడ్డూ ధర మొదట్లో ఒక రూపాయిగా ఉండేది. ఆ తర్వాత పెరిగిన ఖర్చుల నేపథ్యంలో 25 రూపాయలకు చేరుకుంది. గత ప్రభుత్వంలో 50 కి పెరిగింది. కళ్యాణం లడ్డూ ధర 100 నుంచి 200 కు పెరిగింది.. దర్శనానికి వెళ్లిన భక్తులకు చిన్న లడ్డూలను ఉచిత ప్రసాదంగా ఇస్తున్నారు. ఒకవేళ అదనపు లడ్డూలు కావాలంటే భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లడ్డూలు శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో పోటులో తయారుచేస్తారు. ఆ తర్వాత వకుళ మాతకు చూపిస్తారు. అంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న లడ్డూ 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. కళ్యాణం లడ్డూ 700 గ్రాములు ఉంటుంది. ఒక రోజుకు 7,100 కల్యాణ లడ్డూలు తయారు చేస్తారు. చిన్న లడ్డూలను 3.5 లక్షలు తయారు చేస్తారు. ఉచిత పంపిణీకి 1,07,100 మినీ లడ్డూలను రూపొందిస్తారు. రోజుకు నాలుగువేల వడలను తయారుచేస్తారు. శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం 50 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. 1000 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం శ్రీవారికి ఇప్పటికి నైవేద్యం సమర్పిస్తున్నారు. సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి ప్రసాదాలను నివేదిస్తారు.. రోజూ నిత్యసేవలు జరుగుతుంటాయి కాబట్టి… అప్పుడు కూడా వివిధ రకాల నివేదనలు నిర్వహిస్తారు.
ఎలాంటి నైవేద్యాలు పెడతారంటే..
స్వామివారికి సుప్రభాతం సమయంలో నవనీతం, గోవు పాలతో తయారుచేసిన పదార్థాలను సమర్పిస్తారు. తోమాల సేవ పూర్తయిన తర్వాత కొలువు సేవ సమయంలో సొంటి, బెల్లం, నల్ల నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు. సహస్ర నామార్చన అనంతరం జరిగే మొదటి గంట సేవలో మీగడ, వెన్న, పెరుగుతో తయారుచేసిన అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఇక రోజువారి చిత్రాన్నం, దద్దోజనం, కదంబం, క్షీరాన్నం, పాయసం స్వామి వారికి నైవేద్యంగా పెడతారు. మధ్యాహ్నం సమయంలో నాదకం, దోస, వడ, అప్పం, లడ్డూ నైవేద్యంగా పెడతారు. సాయంత్రం అష్టోత్తర శతనామార్చన చేసిన తర్వాత శుద్ధన్నం, సీరా ను నివేదిస్తారు. రాత్రి తోమాల సేవ తర్వాత మిర్యాలతో చేసిన అన్నాన్ని, ఉడాన్నాన్ని సమర్పిస్తారు. ఏకాంత సేవలో పాయసం నైవేద్యంగా పెడతారు. రాత్రి ఆరాధన ముగిసిన తర్వాత ఈ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. శ్రీవారికి పొంగలి, చక్కెర పొంగలి, కేసరి బాత్, పులిహోర, దద్దోజనం, మిరియాల అన్నం, లడ్డు, జిలేబి, పాయసం, కేసరి, కదంబం, వడ, అప్పం, పోలి, బెల్లం దోశ, అమృత కలశం, నెయ్యి దోశ, దోశ, అడ పప్పు, పానకం పెడతారు. ధనుర్మాసం సమయంలో ప్రత్యేకమైన ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు.