https://oktelugu.com/

KCR : బీఆర్ఎస్ ను ఎక్కడికో తీసుకెళదామనుకుంటున్న కేసీఆర్.. పెద్ద ప్లానే వేశాడే!

బీఆర్ఎస్ పార్టీ అధినేత , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వ్యక్తుల కేంద్రంగా కాకుండా ఇకపై పార్టీ కేంద్రంగా బీఆర్ఎస్ ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే, టీడీపీ తరహాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సంకల్పించారు.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 30, 2024 / 10:20 AM IST

    KCR

    Follow us on

    KCR : బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మార్చాలనే వ్యూహం బెడిసికొట్టడం, గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ప్రాభవం చూపలేకపోవడంపై ఆ పార్టీ అధినేత , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వ్యక్తుల కేంద్రంగా కాకుండా ఇకపై పార్టీ కేంద్రంగా బీఆర్ఎస్ ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే, టీడీపీ తరహాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సంకల్పించారు.

    ఎమ్మెల్యేల పాత్ర తగ్గించి, క్యాడర్ పాత్ర పెరిగేలా మార్పులు: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత పదేళ్ల పాటు అధికార పార్టీగా బీఆర్ఎస్ కి క్షేత్రస్థాయి క్యాడర్ అవసరం రాలేదు. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ , కీలక నేతల ఆధారంగానే పార్టీ కొనసాగింది. పదేళ్ల అధికార సమయంలో ఎమ్మెల్యేల కేంద్రంగానే పార్టీ నడిచింది. నియోజకవర్గంలో పార్టీ యావత్తూ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొనసాగింది. ఎమ్మెల్యే ల అభిప్రాయమే క్యాడర్ అభిప్రాయంగా చెలామణి అయింది. ఈ పాలసీ బెడిసికొట్టడం, అనూహ్యంగా పార్టీ ఓటమిపాలవడంతో కేసీఆర్ కళ్ళు తెరిచారు. పార్టీలో నేతల పాత్ర తగ్గించాలని, క్యాడర్ పాత్ర పెంచాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు అధ్యయనం మొదలుపెట్టారు.

    ■ దేశంలో సుదీర్ఘ కాలంగా చెలామణిలో ఉన్న ప్రాంతీయపార్టీలపై అధ్యయనాలు:
    పార్టీని పునర్నిర్మించాలని సంకల్పించిన కేసీఆర్ దేశంలో సుదీర్ఘ కాలంగా విజయవంతంగా కొనసాగుతున్న తమిళనాడులోని డీఎంకే, ఏపీలోని టీడీపీ, ఒడిశా లోని బీజేడీ పార్టీల నిర్మాణంపై దృష్టి పెట్టారు. మాజీ ఎంపీ బాల్క సుమన్ నేతృత్వంలోని ఒక కమిటీని తమిళనాడు కి పంపి, అక్కడ డీఎంకే సంస్థాగత నిర్మాణంపై నివేదిక తెప్పించుకున్నారు. టీడీపీ , బీజేడీల నిర్మాణాలలో ఇక్కడ అమలు చేయడానికి పనికి వచ్చే వాటిని స్వీకరిస్తున్నారు. బీజేపీ , ఆర్ఎస్ఎస్ అమలు చేసే పన్నా ఇంచార్జీల వ్యవస్థని పూర్తిగా అధ్యయనం చేయిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పన్నా తరహాలో పోల్ మేనేజ్మెంట్ నిర్వహించినా అప్పటికే పార్టీ పట్ల ప్రజల్లో విముఖత రావడంతో అది వర్కవుట్ కాలేదు. త్వరలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని క్రియాశీలకం చేయాలని నిర్ణయించడం, నేతల స్థానంలో పార్టీ కమిటీలకి ప్రధాన్యమిస్తారనే లీకులతో బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ మొదలైంది. ఆయా స్థాయిల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఇకపై పూర్తిగా కమిటీల కే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    ■ బీఆర్ఎస్ కి ఒక ఆర్ అండ్ డీ సెంటర్:
    బీఆర్ఎస్ ని బలమైన ప్రజా భాగస్వామ్య పార్టీగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సంకల్పించినట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏమి చేయాలనే అంశంపై పూర్తిగా అధ్యయనం చేశాక పార్టీ ఆయా స్థాయిల్లో ఉద్యమాలు, పోరాటం చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల అవినీతి, అక్రమాలు, రాష్ట్రంలో ఏ మూలలో ఏమి జరుగుతుందనే దానిపై ఎప్పటికప్పుడు పార్టీకి తెలిసేలా, దానిపై పార్టీ స్టాండ్, ఉద్యమాలు, పోరాటాలు నిర్దేశించడానికి పార్టీ అద్వర్యంలో మేధావులు, సీనియర్ నేతలతో ఒక పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్వయంగా తనే ఒక వ్యూహకర్త కూడా కావడంతో ఈ విభాగాన్ని పార్టీకి వెన్నుమకలా తీర్చిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విభాగాన్నే పార్టీకి బ్యాక్ ఆఫీస్ గానూ వినియోగించాలని ఆలోచిస్తున్నారు. మొత్తానికి ప్రతి పక్షంలోకి వచ్చాకైనా వాస్తవాలు గుర్తించి, పార్టీ ప్రక్షాళనకు, పార్టీ ని బలోపేతం చేసేందుకు అధినేత కేసీఆర్ నడుంకట్టడంపై బీఆర్ఎస్ క్యాడర్ ఖుషీగా ఉంది.