Karthika Deepam: మీడియా సంస్థల్లో పని చేసే మెజార్టీ ఉద్యోగులకు హిందూధర్మం మీద నమ్మకం ఉండదు. హిందూ దేవుళ్ళ మీద సానుకూల దృక్పథం ఉండదు. ఇక యాజమాన్యాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హిందూ ధర్మం మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం మీడియా సంస్థలు వదులుకోవు. చివరికి డబ్బుల కోసం.. కార్తీకమాసాన్ని కూడా తెలుగు మీడియా సంస్థలు కమర్షియల్ చేసి పడేశాయి. ఏకంగా కోట్లకు కోట్లు దండుకోవడం మొదలుపెట్టాయి.
కార్తీక మాసం శీతకాలంలో వస్తుంది. కార్తీక మాసాన్ని హిందువులు అత్యంత విశి మీష్టమైనదిగా పేర్కొంటారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు దేవాలయాలలో దీపాలు వెలిగిస్తారు. శివుడికి అభిషేకాలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వనభోజనాలకు కూడా వెళతారు. ఉసిరి చెట్టుకు పూజలు చేసి.. సామూహికంగా భోజనాలు చేస్తారు.
కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది శుభప్రదం అని పురాణాలు చెబుతున్నాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి భావం చాలా ఎక్కువ కాబట్టి చాలామంది కార్తీక మాసాన్ని ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా పూజలు చేసి వస్తారు.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ మాసాన్ని తెలుగు మీడియా పూర్తిగా కమర్షియల్ చేసి పడేసింది. దీపారాధన వేడుకను కూడా డబ్బులు దండుకునే మార్గంగా మార్చుకుంది..
తెలుగులో ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ కార్తీక మాసం సందర్భంగా శివుడికి విశేష పూజల పేరుతో నెలరోజులపాటు భారీగా వేడుక నిర్వహిస్తుంది. ఈ వేడుకకు స్పాన్సర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. ఆ న్యూస్ ఛానల్ చైర్మన్ తన రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే ఉపరాష్ట్రపతుల వరకు పిలిపించుకుంటాడు. వారితో ప్రతిరోజు దీపారాధన చేయించి.. తన చానల్లో గొప్పగా ప్రచారం చేయించుకుంటాడు.
ఇక మరొక ఎలక్ట్రానిక్ ఛానల్ కూడా కార్తీక మాస దీపారాధన వేడుకను కమర్షియల్ చేస్తూ ఉంటుంది. ప్రతి జిల్లాలో ఆ న్యూస్ ఛానల్ మార్కెటింగ్ టీం భారీగా ఈ వేడుకను జరుపుతుంటారు. దీనికోసం స్పాన్సర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు.. పైగా ఈ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ కు అనుబంధం గా భారీ పత్రిక ఉంది. ఆ పత్రికలో కవరేజీ ఇచ్చినందుకు స్పాన్సర్లు మరింత అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి తెలుగు మీడియా కేవలం కార్తీక మాసాన్ని మాత్రమే కాదు.. క్యాలెండర్ యాడ్స్, వార్షికోత్సవం యాడ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెటింగ్ లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ స్థాయి హిందీ మీడియాకు ముఖ్యంగా నేషనల్ మీడియాకు ఒంట పట్టడం లేదు. ఎంతైనా ఇసుక నుంచి తైలం తీయడంలో తెలుగు మీడియా అధిపతులు సిద్ధహస్తులు కదా.. దేవుళ్లను నమ్మరు.. దేవుళ్ళ మీద మాత్రం వ్యాపారం చేస్తారు.. అచ్చం రాజమౌళి మాదిరిగా..