Jagannath Rath Yatra 2025: స్వామివారి రథయాత్రను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. జగన్నాథ జయం జయం అనుకుంటూ స్వామివారి రథయాత్రలో భాగస్వాములు అవుతారు. జగన్నాధుడి రథయాత్ర పేరుకు తగ్గట్టుగానే సాగుతుంది. ఈ రథయాత్రను చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి రథయాత్ర మాత్రమే కాదు.. భక్తులకు అందించే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. విభిన్న రకాలతో ప్రసాదాలు తయారుచేసి స్వామివారికి నివేదిస్తారు. స్వామివారికి నివేదించే ముందు ప్రసాదాల నుంచి ఎటువంటి వాసనలు ఉండవు. ఎప్పుడైతే స్వామివారికి ప్రసాదాన్ని నివేదిస్తారో.. ఆ తర్వాత వాటి నుంచి అమోఘమైన వాసన వస్తుంది. ఒక రకంగా ప్రపంచంలో ఏ దేవుడికి లేని ఇలాంటి విశిష్టత జగన్నాథ స్వామికి మాత్రమే సొంతం.. జగన్నాథ స్వామిని ఊరేగించడానికి ప్రత్యేకంగా రధాలను తయారు చేస్తారు. ప్రతి ఏడాది కూడా కొత్త రథంలోనే స్వామి వారికి యాత్ర నిర్వహిస్తారు. ప్రత్యేకమైన అడవుల్లో లభించే వృక్షాల ద్వారా ఈ రథాలను తయారు చేస్తారు. ఈ రథాలను అనాదిగా తయారు చేస్తున్న కుటుంబ సభ్యులే రూపకల్పన చేస్తారు. పైగా రధాన్ని తయారు చేస్తున్న సమయంలో వారు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే రథం తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు.
Also Read: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
స్వామివారి ఆలయం కూడా ప్రత్యేకమే
జగన్నాథ స్వామి వారి ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఒడిశాలో ఎన్నో రకాలుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పటికీ ఇంతవరకు ఈ ఆలయం చెక్కుచెదరలేదు. పైగా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ ఆలయం ఇంకా పటిష్టంగానే ఉంది. ఈ ఆలయం ఎన్నో రకాల అద్భుతాలకు నిలయం. ఈ ఆలయం పైన కట్టిన జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. వాస్తవానికి పరిసర ఆలయాలపై ఉండే జెండాలు గాలి వీచే దిశలో రెపరెపలాడుతుంటాయి. అయితే జగన్నాథ స్వామి ఆలయం పై ఏర్పాటుచేసిన జెండా మాత్రం వాటికి విరుద్ధంగా ఎగురుతుంటుంది. అయితే ఈ జెండాను ఆలయ పూజారులు ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. ఆ మార్చే ప్రక్రియలో వారు దేవాలయాన్ని జగన్నాథ జగన్నాథ అనుకుంటూ ఎక్కుతుంటారు. అంతటి పెద్ద ఆలయాన్ని వారు ఎక్కుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఒక్క ప్రమాదం చోటు చేసుకోలేదు. మండే ఎండల్లో.. విస్తారంగా కురిసే వర్షాల్లో.. వణికించే చలిలోనూ ఆలయ పూజారులు జెండాలు మారుస్తూ ఉంటారు. పైగా ఆ జెండాలు కూడా ఒకే తీరుగా ఉండేలా చూసుకుంటారు. స్వామివారు భక్తజన కోటికి అభయం ఇస్తున్నట్టుగా ఆ జెండాలు ఉంటాయి. పూరి ఆలయం.. స్వామి వారి ప్రసాదం.. రథయాత్ర మాత్రమే కాకుండా స్వామివారి ప్రధానాలయం పై ఏర్పాటు చేసిన జెండా కూడా ప్రత్యేకంగా ఉండడం ఇక్కడ విశేషం.