Credit Score: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడటం కామన్ అయిపోయింది. చాలామంది రోజువారీ ఖర్చులకు, ఆన్‌లైన్ షాపింగ్‌కు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే, క్రెడిట్ కార్డుల గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా, క్రెడిట్ కార్డు వాడితే మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.. సరైన పద్ధతిలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి, మంచి క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకునేందుకు చాలా సహాయపడుతుంది.
చాలామంది క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని భయపడతారు. కానీ, జాగ్రత్తగా వాడితే మీ క్రెడిట్ హిస్టరీని పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్రెడిట్ కార్డుల వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు వంటి అదనపు లాభాలు కూడా ఉంటాయి. అసలు మీరు క్రెడిట్ కార్డులే తీసుకోకపోతే, మీకు క్రెడిట్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్ అనేదే ఉండదు. అలాంటప్పుడు, భవిష్యత్తులో మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాబట్టి, కార్డు వాడుతూనే మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా బిల్లులను సకాలంలో చెల్లించడం, కార్డు లిమిట్‌ను తక్కువగా ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కువ కార్డులు ఉంటే సమస్యనా?
ఇంకొక అపోహ ఏమిటంటే, ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది అని. కానీ, మీరు జాగ్రత్తగా వాటిని మేనేజ్ చేయగలిగితే, రెండు మూడు కార్డులు ఉన్నా పెద్ద సమస్య ఉండదు. ఉదాహరణకు, ఒకటి రోజువారీ ఖర్చులకు, రెండోది ప్రయాణాలకు, మూడోది ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవాలంటే, మరీ ఎక్కువ అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు, వాటిని వాడటంలోనూ, బిల్లులు కట్టడంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏమి చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది?
కార్డు లిమిట్ కంటే ఎక్కువగా వాడితే అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. గడువులోగా బ్యాలెన్స్ కట్టకపోతే, మీ క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. మినిమం పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని వదిలేస్తే, దానిపై వడ్డీ భారం పెరుగుతుంది. కొత్త లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులు దీన్ని గమనిస్తాయి. కాబట్టి, వీలైనంతవరకు మొత్తం బ్యాలెన్స్ కట్టడానికి ప్రయత్నించండి. పాత కార్డులను క్యాన్సిల్ చేయడం మంచిది కాదు. దీనివల్ల మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుంది. అది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. మీకు ఎక్కువ కార్డులు ఉన్నాయనిపిస్తే మీరు ఇటీవల తీసుకున్న కార్డులను క్యాన్సిల్ చేసుకోవచ్చు.
Also Read: Dubai India connection history: దుబాయి: నాడు అఖండ భారతావనిలో భాగమే.. ఎలా విడిపోయిందంటే..?
ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల నిబంధనలు కాస్త కఠినంగా మారుతున్నాయి. అదే సమయంలో, బ్యాంకులు కార్డులు జారీ చేయడంలో పోటీ పడుతున్నాయి. కొత్త కార్డులు తీసుకునేటప్పుడు వాటి నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే, మీరు ఇప్పటికే వాడుతున్న కార్డును కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి.