YS Jagan Mohan Reddy family : సోదరి షర్మిల తో జగన్ రాజీ కుదుర్చుకున్నారా? కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారా? ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న వేళ కుటుంబంలో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవాలని ఆత్మీయులు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే సోదరి షర్మిలకు రాజీ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు తనకు ఎవరి అవసరం లేదని.. ప్రజలకు అన్ని ఇచ్చాను కనుక తననే ఎన్నుకుంటారని భావించారు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. అనుకున్నట్టుగా గెలుపు సాధించలేదు. కుటుంబం లేనిదే గెలవడం కష్టమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే చెల్లెలు షర్మిల కు రాయబారం పంపినట్లు సమాచారం.
* ఆస్తి వివాదాలతోనే
వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాలే.. వారిద్దరి మధ్య వివాదానికి కారణం. ఈ విషయాన్ని షర్మిల చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సోదరుడు జగన్ కోసం ఎన్నో చేశానని.. జైలులో ఉన్నప్పుడు పార్టీని బతికించానని.. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ బాధపడ్డారు. అటువంటి నన్నే అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వంగా తనకు లభించాల్సిన ఆస్తిపాస్తులు ఇవ్వలేదని కూడా సంకేతాలు ఇచ్చారు. రాజకీయంగా తనను వాడుకుని వదిలేశారని.. పదవులు ఇవ్వకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
* అందుకే రాజకీయ పోరాటం
తండ్రి వారసత్వంగా రావాల్సిన ఆస్తిపాస్తులు రాకపోవడం, కుటుంబం ఎంత చెప్పినా జగన్ వినకపోవడంతో రాజకీయ పోరాటమే శరణ్యంగా షర్మిల భావించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి.. అదే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తన ఉన్నతి కంటే జగన్ పతనాన్ని ఎక్కువగా కోరుకున్నారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. షర్మిల వల్లే తాను ఓడిపోయానని జగన్ ఇప్పుడు భావిస్తున్నారు. అందుకే షర్మిల తో రాజీకి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
* షర్మిల కే లోటాస్ పండ్
అవసరం ఎంత పని అయినా చేయిస్తుందంటారు. గతంలో వాటా ఇచ్చేందుకు జగన్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు షర్మిలకు ఆస్తుల్లో సగం వాటా ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని లోటాస్ పాండు మొత్తం ఇచ్చేయడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో వాటా కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ షర్మిల పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఒకవేళ ఆస్తులు ఇచ్చినా.. రాజకీయ పోరాటం ఆపే ప్రసక్తి లేదని ఆమె తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే జగన్ ఫ్యామిలీకి భయపడుతున్నారు. కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. మరి అందులో ఎంతవరకు సఫలీకృతులు అవుతారో చూడాలి.