Haryana: మనదేశంలో చారిత్రాత్మకంగా విభిన్నమైన ఐతిహ్యం యమధర్మరాజును శివుడు బంధించిన ఆలయం సొంతం. ఈ ఆలయంలో మార్కండేశ్వరుడు శివుడి కోసం తపస్సు చేశాడు. యమధర్మరాజును ఓడించి అమరుడిగా నిలిచాడు. భక్తులను రక్షించేందుకు శివుడు ఈ ఆలయంలో యమధర్మరాజును బంధించాడని పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో శివుడిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని.. వారు దీర్ఘాయువును పొందుతారని ప్రతీతి. ఈ ఆలయం హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని షహబాద్ మార్కండ పట్టణం లో ఉంది. 5000 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయం సొంతం. ఆలయాన్ని విక్రమాదిత్య చక్రవర్తి కాలంలో నిర్మించాలని చెబుతుంటారు.. పురాణాల ప్రకారం కష్టాల్లో ఉన్న భక్తులను రక్షించడానికి శివుడు ఇక్కడికి వచ్చాడని.. నేరుగా యమధర్మరాజును బంధించాడని తెలుస్తోంది.
ఇదీ చారిత్రక ఐతిహ్యం
మృకండ మహర్షి కొడుకును పొందడానికి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం తక్కువ ఆయుష్షు కలిగిన కొడుకు పుడతాడు. అతడికి మార్కండేయుడు అని పేరు పెడతాడు. తన కుమారుడి ఆయువు గురించి మృకండ మహర్షి నిత్యం ఆందోళన చెందుతూ ఉంటాడు. తండ్రి దిగులుగా ఉండటం చూసి మార్కండేయుడికి బాధ కలుగుతుంది. దీంతో తన తండ్రిని పదే పదే దాని గురించి అడిగితే.. మార్కండేయుడికి అతడి జన్మ వృత్తాంతం గురించి మొత్తం చెబుతాడు. దీంతో మార్కండేయుడు అవంతిక తీగంలోని మహాకాలవనంలోకి వెళ్తాడు. అక్కడి ఆలయంలో శంకరుడి వరం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. మార్కండేయుడికి 12 సంవత్సరాల వయసు రావడంతో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. అతడిని తీసుకెళ్లడానికి వస్తాడు. అయితే మరణించడానికి మార్కండేయుడు ఒప్పుకోడు. తనను తాను కాపాడుకోవడానికి శివుడికి రెండు చేతులతో ప్రణమిల్లుతాడు. శివుడి విగ్రహాన్ని రెండు చేతులతో పట్టుకుంటాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై సీమ ధర్మరాజును బంధిస్తాడు. అంతేకాదు మార్కండేయుడికి 12 కల్పాలు జీవించే వరం ఇస్తాడు.
నిత్యం రద్దీ ఉంటుంది..
ఈ ఆలయంలో శివలింగంపై సహజంగా ఒక కన్ను ఉంటుంది.. అయితే ఈ శివలింగాన్ని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం లో నిత్యం రద్దీ ఉంటుంది. శివరాత్రి సమయంలో జన ప్రవాహం అధికంగా ఉంటుంది.. ఈ ఆలయం ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతోంది. పైగా యమధర్మరాజును శివుడు బంధించిన ఆలయం కావడంతో.. చారిత్రాత్మకంగా ఈ క్షేత్రానికి విశిష్టమైన పేరు ఉంది. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్షేత్రానికి వెళ్లేందుకు హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్లు నిర్మించింది. బస్సులు కూడా నడుపుతోంది.