Devunigutta Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందంటే.. మరో మాటకు తావు లేకుండా ఆంకోర్ వాట్ అని చెబుతారు. ఈ ఆలయం కాంబోడియాలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని భారతదేశానికి చెందిన రాజులు పరిపాలించేవారు. వారి పరిపాలన కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో దేశాలు ఏర్పాటు కావడంతో ఈ ఆలయం కాంబోడియాకు పరిమితమైంది.
Also Read: స్వేచ్ఛకు గతంలోనే రెండు వివాహాలు.. పూర్ణచందర్ సంచలన లేఖ వైరల్
ఆంకోర్ వాట్ లాంటి ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు అడవుల్లో ఉంది. దేవుని గుట్ట ప్రాంతంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణం అత్యంత విశిష్టంగా ఉంది. చరిత్రకారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆలయ నిర్మాణ శైలి కూడా విచిత్రంగా కనిపిస్తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు ప్రాంతంలోని కొత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న దేవుని గుట్టలపై ఈ ఆలయం నిర్మితమై ఉంది. దీనిని స్థానికులు దేవుని గుట్ట ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఇసుకరాయితో నిర్మించారు.. 2×2 అడుగులు, 2×1 అడుగుల కొలతలతో ఈ ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణంలో రాతిబిల్లలను ఉపయోగించారు. ఆలయ నిర్మాణాన్ని పిరమిడ్ మాదిరిగా చేపట్టడం విశేషం.. ఆలయ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన గోడలమందం 9 అడుగులుగా ఉంది. గోడల మధ్యలో ఖాళీ వదిలారు. ఇలా వదలడం వల్లనే వందల సంవత్సరాల గడిచినప్పటికీ ఆలయం ఇంతవరకు చెక్కుచెదరలేదు.
ఈ ఆలయంలో పలికి వెళ్లడానికి తూర్పు వైపున ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న గోడలపై బుద్ధుడి చరిత్ర కనిపిస్తోంది. శిల్పాలు కూడా నాటు చరిత్రను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన గోడపై బుద్ధుడు తన శిష్యులకు పాఠాలు బోధిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో గోడకు యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో రాజు చేతిలో ఖడ్గంతో ఉన్నాడు. బౌద్ధ జాతక కథలకు సంబంధించిన నేపథ్యాన్ని వివరించే శిల్పాలు గోడల మీద కనిపిస్తున్నాయి. గుడి ఎదురుగా పాలరాతి కర్రతో చేసిన స్తంభం కనిపిస్తోంది. దీనిని ఆయక స్తంభం అని స్థానికులు పిలుస్తున్నారు. బౌద్ధ స్తూపాల ఎదురుగా ఇలాంటి ఆయక స్తంభం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ స్తంభానికి నాలుగు వైపులా అర్థ పద్మాలు.. సింహాలు కనిపిస్తున్నాయి.
బౌద్ధులకు స్థావరంగా చైత్యాలయాన్ని పిలుస్తారు. అయితే దానికంటే ముందే దేవుని గుట్టలు బౌద్ధులకు స్థావరం గా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఈ ఆలయంలోని దక్షిణం వైపు ఉన్న గోడమీద పద్మపాణి ని పోలి ఉన్న బోధి సత్వుడు కనిపిస్తున్నాడు. బోధిసత్వుడు లలితాసనంలో రాణితో కూర్చున్న ఆసనం ఈ దృశ్యంలో కనిపిస్తోంది. ఇక పడమర వైపు ఉన్న గోడ మీద అర్ధనారీశ్వర రూపంలో ఒక శిల్పం చెక్కి కనిపిస్తోంది. ఆ శిల్పంలో ఈశ్వరుడు, పార్వతి దేవి స్పష్టంగా కనిపిస్తున్నారు.. ఇక అదే పై వరుసలో బుద్ధుడు బోధనలు చెబుతుంటే రాజులు, రానులు వింటున్నారు. మిధునాలు కూడా ఈ శిల్పంలో కనిపిస్తున్నాయి.
ఇనుప రాతి ఇటుకల మీద పూర్వకాలంలో పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆలయంలోని ఈశాన్యం మూలన ఉన్న గోడమీద అమితాభుడు కనిపిస్తున్నాడు. ఈ ఆలయ నిర్మాణాన్ని క్రీస్తు శకం ఆరు లేదా ఏడవ శతాబ్దంలో చేపట్టారని తెలుస్తోంది. పర్యాటకానికి ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో మారుమూల ములుగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా పర్యాటక ప్రాంతం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఇక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు ఉండడంతో పర్యాటకులు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. పూర్తిగా ఇనుప రాతి ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించిన నేపథ్యంలో.. పర్యాటకులు సందర్శించడానికి మక్కువ చూపిస్తారని స్థానికులు అంటున్నారు.