Kashyap Patel : అగ్రరాజ్యం అమెరికాలో 2025, జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్ తన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. వైట్‌హౌస్ కార్యవర్గంతోపాటు వివిధ కీలక శాఖలకు అధిపతులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో విధేయులకు, సమర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన అమెరికన్లకు పదవులు దక్కాయి. తాజాగా మరో కీలక పదవి.. ఇది సాదాసీదా పదవి కాదు. అమెరికాలోనే అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) చీఫ్ పదవికి భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్(44)ను ఎంపిక చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో కాష్ పటేల్‌గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో ‘ఎఫ్‌బీఐ తదుపరి డైరెక్టర్‌గా కశ్యప్.. కాష్ పటేల్ సేవలందిస్తారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నా’ అని ట్రంప్ తన సోషల్‌మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. ‘కాష్ సూక్ష్మ బుద్ధిగల న్యాయవాది. పరిశోధకుడు. అవినీతి గుట్టు రట్టు చేయడానికి, న్యాయాన్ని కాపాడడానికి, అమెరికా ప్రజల పరిరక్షణకే ఆయన కేరీర్ అంతా పాటు పడ్డారు’ అని ట్రంప్ కొనియాడారు. తాను మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాష్ పటేల్ రక్షణ శాఖలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా, జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు. అని కొనియాడారు. ఎఫ్‌బీఐకి గతంలో ఉన్న విశ్వసనీయతను, ధైర్యాన్ని, నైతికతను కాష్ పటేల్ తిరిగి తీసుకువస్తారని నమ్ముతున్నట్లు వెల్లడించారు. అమెరికా పాలనా యంత్రాంగంలోనూ, నిఘా, దర్యాప్తు సంస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు అవసరమనే భావనలో ఉన్న ట్రంప్.. తన వీర విధేయుడిగా పేరున్న కాష్ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. ట్రంప్ అధికారం చేపట్టే 2025, జనవరి 20న ప్రస్తుత ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టఫర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2017 నుంచి క్రిస్టఫర్ పనిచేస్తున్నారు. ఈయనను కూడా ట్రంపే నియమించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయాక ఎఫ్‌బీఐ అధికారుల తన కార్యాలయాలపై దాడులు చేయంతో ట్రంప్ ఆ సంస్థపై ద్వేషం పెంచుకున్నారు. అందకే చీఫ్‌ను మార్చారు. అయితే కాష్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం తప్పనిసరి.
గుజరాతీ మూలాలు..
కాష్ పలేట్ తల్లిదండ్రులు మొదట ఉగాండడాలో ఉండేవారు. అక్కడ ఈడీ అమీన్ పాలనలో ప్రబలిన అరాచకాలను భరించలేక 1970లో అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లో స్థిరపడ్డారు. కాష్ పటేల్ 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జన్మించారు. 2005లో పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్(టీచర్ ఆఫ్ లా) పొందారు. అనంతరం ఫ్లోరిడాలో ఎనిమిదేళ్లు పబ్లిక్ డిఫెండర్‌గా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, మారణాయుధాలకు సంబంధించిన నేరాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను వాదించారు. 2014లో అమెరికా న్యాయ శాఖ జాతీయ భ్రదతా విభాగంలో ట్రయల్ అటార్నీగా చేరారు. ఆ సమయంలోనే జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు సేవలందించారు. 2017లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ కౌనిసల్‌గా నియమితులయ్యారు.
ట్రంప్ టీంలో చేరి…
హౌస్ పర్మినెంట్ సెలక్ట్ కమిటీలో స్టాఫర్‌గా పనిచేశారు. ఆసమయంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు. ఆయన బృందలో చేరారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు వీలుగా రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై జరిపిన దర్యాప్తును రిపబ్లికన్ల తరఫున వ్యతిరేకించడంలో కీలకంగా వ్యవహరించారు. ట్రంప్‌పై బైడెన్ సర్కార్ తీరును నిరసిస్తూ గవర్నమెంట్ గ్యాంగ్‌స్టర్స్ అనే పుస్తకాన్ని ట్రంప్ సింహంగా చిత్రీకరించి ద ప్లాట్ ఎగైనెస్ట్ ద కింగ్ అనే పుస్తకాన్ని రాశారు. ట్రంప్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనతోనే ఉన్నారు.