Roja: మాజీ మంత్రి రోజా దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అవసరమైతే అరెస్టులు చేసుకోవాలని సవాల్ విసురుతున్నారు. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రోజా వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఆమెకు కేసుల విషయంలో ముందస్తు క్లారిటీ ఉందని.. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసుగా వైసిపి నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశి మోహన్ లాంటి నేతలపై కేసులు నమోదవుతుండడం అందులో భాగమే. రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ జాబితాలో మాజీ మంత్రి రోజా సైతం ఉంటారని అందరికీ ఒక అనుమానమే. కానీ ఇప్పటివరకు ఆమెపై కఠిన కేసులు ఏవీ నమోదు చేయలేదు. అయితే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణ, పర్యాటక శాఖకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ కూడా కొనసాగుతోంది. త్వరలో అరెస్టుల పర్వం ఉంటుందని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజా కూటమికి సవాల్ విసురుతుండడం విశేషం.
* రోజా పై రకరకాల ప్రచారం
ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీలో చేరుతున్నారు. అయితే వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు మాత్రం కూటమి పార్టీల్లో ఎంట్రీ లభించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది నేతలు వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే రోజాపై అనేక రకాల పుకార్లు వచ్చాయి. ఆమె తమిళనాడు వెళ్ళిపోతున్నారని.. తమిళ రాజకీయాల్లో ప్రవేశిస్తారని టాక్ నడిచింది. దీంతో వైసిపి కి ఆమె రాజీనామా చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా వైసిపి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు రోజా. తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు.
* కేసుల భయంతోనే?
అయితే మంత్రిగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కేసులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రోజా ఒక్కసారిగా తీవ్ర స్వరం వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. మహిళా నేతగా తనపై కేసులు నమోదు చేసి హింసిస్తే.. కూటమిపై వ్యతిరేకత రావడం ఖాయమని రోజా అంచనా వేస్తున్నారు. అందుకే వీలైనంతగా కూటమిపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గుతారని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె విషయంలో కూటమి సర్కార్కు ఒక క్లారిటీ ఉంది. సరైన సమయంలో ఆమెపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. అయితే రోజా కామెంట్స్ సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తున్నాయి. ఆమె దూకుడు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.