Adari Anand Kumar: వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ బిజెపిలో చేరిక వెనుక వ్యూహం ఏంటి? దీని వెనుక ఉన్నది ఎవరు?పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ నేతగా ఉన్న అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ గా వ్యవహరించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ డైరీ లో జరిగిన అవినీతిపై విచారణ కూడా కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అడారి ఆనంద్ కుమార్ టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పార్టీ శ్రేణులు ఒప్పుకోలేదు. అయితే సడన్ గా బీజేపీలో చేరిపోయారు. ఆయన చేరిక బీజేపీ నేతలకు సైతం ఇష్టం లేదు. కానీ ఆయన చేరిక వెనుక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
* విశాఖ జిల్లా పై ప్రభావం
ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు సీఎం రమేష్.అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఉమ్మడి విశాఖలో మంచి ప్రభావమే చూపిస్తున్నారు. అక్కడ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నా.. సీఎం రమేష్ మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం.అయితే సీఎం రమేష్ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 1985 నుంచిపార్టీలో కొనసాగుతూ వచ్చారు.2012 నుంచితెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన ఆయన బిజెపిలో చేరారు.2019 ఎన్నికల తరువాత ఆయన బిజెపిలో చేరారు. అది టిడిపి ప్రయోజనాల కోసమేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో టిడిపి తో బిజెపి కలవడం వెనుక సీఎం రమేష్ పాత్ర ఉంది.
* ఈ ఎపిసోడ్ వెనుక ఆయనే
అయితే ఇప్పుడు అడారి ఆనంద్ కుమార్ ఎపిసోడ్ వెనుక సీఎం రమేష్ స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు అనుమతి తీసుకోకుండా.. ఆరోపణలతో పాటు విచారణను ఎదుర్కొంటున్న ఆనంద్ కుమార్ ను తీసుకోవడం అంత ఈజీ కాదు. తప్పనిసరిగా సీఎం చంద్రబాబు డైరెక్షన్ లోనే సీఎం రమేష్ వ్యవహరించి ఉంటారన్న అనుమానం ఉంది. స్థానిక టిడిపి నేతల అభ్యంతరాలతో ఆనంద్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడం కుదరదు. అలాగని ఆనంద్ కుమార్ కుటుంబమంతా గతంలో సుదీర్ఘకాలం టిడిపికి సేవలందించింది. ఆ లెక్క తోనే సీఎం రమేష్ తో చంద్రబాబు కథ నడిపించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.