https://oktelugu.com/

Bhogi 2025: లక్ష పిడకలతో భోగి పండుగ.. ఈ గ్రామం ఆచారం తెలిస్తే షాక్ అవుతారు..

సంక్రాంతికి ముందు వచ్చే పండుగ భోగి. ఈ రోజున చిన్న పిల్లలపై భోగిపండ్లు వేస్తారు. రాత్రి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో ఒకప్పుడు పిడకలు వేసి ప్రత్యేక పూజలు చేసేవారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 11, 2025 / 05:59 PM IST

    Bhogi 2025

    Follow us on

    Bhogi 2025: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు వారి ఇళ్లల్లో సందడి నెలకొంటుంది. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వారు తమ సొంతూళ్లకు వచ్చి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లో అనాధిగా వస్తున్న సాంప్రదాయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులతో సందడి చేస్తారు. రంగురంగుల ముగ్గులతో అలరిస్తారు. భోగి, సంక్రాంతి రోజున ముగ్గులపై గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి పండుగలో భాగంగా కొన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో ఓ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో ఊరంతా కలిసి పిడకల వేడుక నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఓ మహిళ లక్ష పిడకలు తయారు చేసి భోగి పండుగను నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

    సంక్రాంతికి ముందు వచ్చే పండుగ భోగి. ఈ రోజున చిన్న పిల్లలపై భోగిపండ్లు వేస్తారు. రాత్రి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో ఒకప్పుడు పిడకలు వేసి ప్రత్యేక పూజలు చేసేవారు. కానీ రాను రాను ఇవి కనుమరుగైపోతున్నాయి. అయితే ప్రతీ సంక్రాంతిలో పిడకలు కచ్చితంగా ఉండాలని కొన్ని గ్రామాల్లో నిబంధనలు పెట్టారు. దీంతో పిడకలను ఆన్ లైన్ లోనూ విక్రయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కొందరు పిడకలు తయారు చేస్తూ వాటిని వంట చెరుకుగా ఉపయోగిస్తారు.

    అయితే సంక్రాంతి సందర్భంగా ఓ గ్రామంలో పిడకలు వేడుకను నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లా సీతానరగం మండలం రాపాక అనే గ్రామంలో ప్రతీ ఏటా పిడకలుతో కలిసి భోగి పండుగ నిర్వహించుకుంటారు. ఈరోజున ఇంటికి ఒక పిడుకైనా ఇచ్చి గ్రామంలో ఓ చోట వీటిని పేర్చి భోగి మంటలు వేస్తారు. ఇలా గ్రామస్తులంతా కలిసి మెలిసి ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఈ గ్రామం నుంచి పెళ్లిళ్లు చేసుకొని వేరే గ్రామాల్లోకి వెళ్లిన వారు సైతం కుటుంబ సమేతంగా ఈ గ్రామానికి వచ్చి పిడకలు వేడుకలో పాల్గొంటారు.

    ఈ పండుగలో భాగంగా గ్రామానికి చెందిన ఓ మహిళ లక్ష పిడకలను తయారు చేసింది. డిసెంబర్ 15 నుంచి కొన్ని రోజుల పాటు పేడను సేకరించి లక్ష వరకు పిడకలును తయారు చేసింది. ఈసారి గ్రామస్తులతో పాటు తన లక్ష పిడకలను కూడా భోగి కార్యక్రమంలో వేసేందుకు సిద్ధమైంది. దీంతో ఈమె ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. సాధారణంగా ఇంటికి ఒక పిడుక తెచ్చే సాంప్రదాయం ఉంది. కానీ తన ఇంటి నుంచి లక్ష పిడకలు ఇచ్చేందుకు రెడీ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    అయితే ఇలా పిడకలు చేసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబం బాగుండాలని ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కొందరు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈసారి జనవరి 13న సోమవారం భోగి పండుగను నిర్వహించనున్నారు. ఈ పండుగ కోసం రాపాక గ్రామానికి చెందిన మహిళ పిడకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి గ్రామంలో నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.