Pawan Kalyan: సోషల్ మీడియా( social media) మరింత రెచ్చిపోతోంది. రాజకీయ దుర్వినియోగం అవుతోంది. కనీసం స్థాయిని కూడా లెక్కచేయకుండా లేనిపోని ప్రచారానికి దిగుతున్నారు. అటువంటిదే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ పై సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అది మరింత జుగుప్సాకరంగా ఉంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు నమస్కరిస్తూ.. క్షమించండి అంటూ పవన్ అడిగినట్లు ఓ ఫోటో తో పాటు పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. దానిని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. ప్రస్తుతం ఈ విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు( TTD trust board) మొత్తం క్షమాపణ చెప్పాల్సిందేనని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఫోటోను ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
* ప్రభుత్వం సీరియస్
వైకుంఠ ఏకాదశి( vaikunta Ekadashi ) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముగ్గురు మంత్రులతో కూడిన బృందం వెనువెంటనే అక్కడకు వెళ్ళింది. అటు తరువాత సీఎం చంద్రబాబు వెళ్లారు. ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు అధికారులపై బదిలీ వేటు వేశారు కూడా. అటు తరువాత డిప్యూటీ సీఎం పవన్ తిరుమల వెళ్లారు. పరిస్థితిని పరిశీలించి ఈవో తో పాటు అడిషనల్ ఈవో సైతం బాధ్యత తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం గా ఉన్నాను కాబట్టి క్షమించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అలాగే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మృతుల కుటుంబాల పరిహారం విషయంలో తీర్మానం చేయాలని.. పరిహారం చెక్కులను సభ్యుల స్వయంగా తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సూచించారు పవన్.
* వారు క్షమాపణలు చెప్పాల్సిందే
మరోవైపు నిన్న పిఠాపురంలో( Pithapuram) పర్యటించారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). మినీ గోకులాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిటిడి అంశాలను ప్రస్తావించారు. టీటీడీ చైర్మన్ తో పాటు అడిషనల్ ఈవో సైతం క్షమాపణలు చెప్పాలని కోరారు. ఒక బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం గా తాను క్షమాపణలు కోరానని.. అక్కడ బాధ్యతలు చూసే మీరు ఎందుకు క్షమాపణలు కోరారని ప్రశ్నించారు. దీంతో ఇది పెను దుమారానికి దారితీసింది. దీంతో ఇది వైసీపీకి సైతం ప్రచార అస్త్రంగా మారింది. జగన్ ఇప్పటికే బాధితులను పరామర్శించారు. అటు వైసీపీ నేతలు సైతం తెరపైకి వచ్చి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడం ప్రారంభించారు.
* పవన్ టార్గెట్
అయితే ఇదే అదునుగా రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan).. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ప్రారంభించారు. లడ్డు ఇష్యూ సమయంలో వైసీపీ ది తప్పు లేకపోయినా.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని.. ఇప్పుడు దీక్ష చేయాలి అంటూ ఎక్కువమంది సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. మరోవైపు క్షమాపణల చుట్టూ వివాదం నడుస్తుండడంతో.. ఏకంగా పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు క్షమించాలని కోరుతూ వేడుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటో మార్ఫింగ్ అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పై ఇలా ప్రచారం తగదని ఖండిస్తున్నారు.