Ardhaashtama Shani : శని దేవుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే మనుషులు చేసే తప్పులను సరిదిద్దుతూ సక్రమ మార్గంలో నడిపిస్తాడు శని. ఈ క్రమంలో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అయితే వాటిని భరించి ముందుకు వెళ్లి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అయితే చాలామంది కష్టాలకు భయపడి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు శనిని తలుచుకుంటూ వాటిని భరించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా కష్టాల సమయంలోనూ తప్పులు చేయడం వల్ల మరిన్ని కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొందరికి అర్ధాష్టమ శని ఉండడంవల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. అసలు అర్ధాష్టమ శని అంటే ఏమిటి? ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
ఎవరి జాతకంలోనైనా నాలుగవ స్థానంలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు. ఈ శని ప్రభావం రెండున్నర ఏళ్ళు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆటంకం కలిగే అవకాశం ఉంది. వాహనాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వివాహం జరుగుతుంది. అయితే వివాహం జరిగిన తర్వాత చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే ఛాన్సులు ఉన్నాయి. వ్యాపారులకు కొంతవరకు నష్టం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు శని పూజ చేసి ప్రారంభించాలి.
అయితే అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గేందుకు పరిహారం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జాతకంలో అర్ధాష్టమ శని ఉందని తేలిన తర్వాత ప్రతి శనివారం.. ముఖ్యంగా శని త్రయోదశి రోజున శని దేవుడికి తైలాభిషేకం చేయాలి. 40 రోజులపాటు నవగ్రహ ప్రదక్షిణలు చేసి చివరి రోజు శని దేవుడికి దీపాలతో అలంకరించి తైలాభిషేకం చేయాలి. శని ప్రభావం ఎక్కువగా ఉండకుండా నల్ల చీమలకు దానం చేస్తూ ఉండాలి. వీటికి పంచదార ఇవ్వడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే బ్రాహ్మణులకు శక్తి మేరకు దానం చేయాలి.
ఓం నమో భగవతే కూర్మనాధాయ.. అనే మంత్రంను జపించి పనులు ప్రారంభించడం వల్ల శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఈ మంత్రమును 3, 11, 21 మూడింటిలో ఏదైనా ఒక అంకె వరకు ఈ మంత్రమును చదవడం వల్ల శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఈ మంత్రంతోపాటు గాయత్రీ జపం చేయడం వల్ల కూడా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని కాకుండా ఇతరులు కూడా శని బాధ పోవాలంటే ప్రతి శనివారం శనిదేవుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉండాలి.