Hindupuram  : పట్టించుకునే నేత లేక హిందూపురంలో వైసీపీ ఖాళీ.. బాలకృష్ణ భారీ పొలిటికల్ స్కెచ్

చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయాలను విడిచిపెట్టి వ్యాపారాలను చూసుకుంటున్నారు. దీంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పక్క పార్టీల వైపు చూస్తోంది. హిందూపురంలో అయితే వైసీపీ క్యాడర్ గుంప గుత్తిగా టిడిపిలో చేరుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : August 16, 2024 1:05 pm

Balakrishna In Hindhupuram

Follow us on

Hindupuram : గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రముఖంగా వినిపించే పేరు హిందూపురం. ఎట్టి పరిస్థితుల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామని వైసిపి నేతలు ప్రతిజ్ఞ చేశారు. బాలకృష్ణను ఓడించి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పుకొచ్చారు. కులాలు, మతాలుగా ప్రజలను విభజించారు. చివరకు టిడిపి నాయకులను సైతం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాలకృష్ణ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బాలకృష్ణ భారీ విజయం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ కొట్టి హిందూపురంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వాస్తవానికి నందమూరి కుటుంబానికి హిందూపురం పెట్టని కోట. నందమూరి తారక రామారావు, హరికృష్ణ గతంలో ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. ఈ ఎన్నికల్లో వీరవిహారం చేశారు. ప్రత్యర్థులకు అందని రీతిలో విజయం సొంతం చేసుకున్నారు. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలను చిత్తు చేశారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కంటే హిందూపురం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు పెద్దిరెడ్డి. ఒకవైపు టిడిపి నేతలను కొనుగోలు చేస్తూనే.. మరోవైపు పెద్ద ఎత్తున ఇన్చార్జిలను మార్చారు. అయినా సరే పెద్దగా వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ విజయాన్ని ఆపలేకపోయారు.

* కానరాని నేతలు
ఇప్పుడు వైసీపీ నేతలు కనిపించడం లేదు. చెట్టుకొకరు పుట్టకొకరు గా మారిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ పుంగనూరు వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నారు. ఎంపీగా పోటీ చేసిన శాంతమ్మ బళ్లారికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన దీపికా రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయారు. లోకల్ వైసిపి నేతలు కష్టమని సైలెంట్ అయ్యారు. ఉన్న పదవులు కావాలనుకుంటున్న వారు టిడిపిలో చేరిపోతున్నారు.

* పెద్దిరెడ్డి హవా
మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. వారం రోజులు పాటు హిందూపురంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి మకాం వేశారు. వ్యూహాలు రూపొందించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అదే స్ఫూర్తితో నాలుగు మండలాల్లో టిడిపి నాయకులను పెద్ద ఎత్తున వైసీపీలో చేర్పించుకున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలే వైసిపికి శాపంగా మారాయి. టిడిపి కూటమికి కలిసి వచ్చాయి. టిడిపి అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసిన బాలకృష్ణ విజయానికి మార్గం సుగమం చేశాయి.

* టిడిపిలోకి భారీగా చేరికలు
తాజాగా హిందూపురం నుంచి టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయి. వైసిపి పూర్తిగా ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో మున్సిపల్ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. మునిసిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ కూడా చేరిన వారిలో ఉన్నారు. దీంతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు రాజకీయంతో చేజారిపోయిన హిందూపురం మున్సిపాలిటీ.. మళ్లీ టీడీపీ వశమైంది. త్వరలో 4 మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు సైతం టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసిపి హిందూపురంలో లేనట్టే.