Nominated Posts : కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. దీపావళి లోగా నామినేటెడ్ పదవులను ప్రకటించాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి విడత పదవులను ప్రకటించింది. రెండో విడత పదవుల భర్తీపై కసరత్తు చేసింది. తొలి విడతలు 20 కార్పొరేషన్లకు సంబంధించి అధ్యక్షులతో పాటు 99 మంది డైరెక్టర్లను నియమించారు. జనసేనకు మూడు, బిజెపికి ఒక కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇచ్చారు. 16 కార్పొరేషన్ల అధ్యక్షులను టిడిపి నేతలతో భర్తీ చేశారు. అయితే తొలి విడతలో పదవులు ఆశించిన టిడిపి నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు బిజెపి, జనసేనలో సైతం అదే పరిస్థితి కనిపించింది. అందుకే ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ రెండో జాబితాలో మూడు పార్టీల నుంచి 40 మందికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 కి పైగా కార్పొరేషన్ పదవులను ప్రకటిస్తారని సమాచారం. టీటీడీ ట్రస్ట్ బోర్డుతో పాటు వివిధ దేవాలయాల పాలకమండళ్లకు సైతం కార్యవర్గాలను నియమించినట్లు తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ పదవులు సైతం భర్తీ చేస్తారని తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి వచ్చిన దరఖాస్తులతో పాటుగా తన దగ్గర ఉన్న సమాచారంతో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ఆ నేతలంతా ఎదురుచూపు
గత ఐదేళ్లలో టిడిపి నేతలు ఎంతో కష్టపడ్డారు. ఇబ్బందికర పరిస్థితులను సైతం ఎదుర్కొన్నారు. అటువంటి వారంతా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు బిజెపి, జనసేనతో పొత్తుల కారణంగా చాలామంది తమ సీట్లను త్యాగం చేశారు. అటువంటి వారు ఒక 30 నుంచి 50 మంది వరకు ఉన్నారు. వారు సైతం పదవులు ఆశిస్తున్నారు. తొలి దశలో పదవులు దక్కకపోయేసరికి అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈసారి సర్వే తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దానికి అనుగుణంగా పదవులు కేటాయించినట్లు తెలుస్తోంది.
* ఈసారి సీనియర్లకు పక్కా
ఈసారి తెలుగుదేశం పార్టీ సీనియర్లకు అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా, పట్టాభి, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న వంటి వారి పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. మరోవైపు జనసేనతో పాటు బిజెపి నేతలను సైతం పదవులు ఇస్తారని తెలుస్తోంది. దీపావళికి ముందే పదవులు ప్రకటిస్తారని సమాచారం. అయితే అమావాస్య సెంటిమెంట్ నడుస్తుండడంతో జాబితా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.