తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో తెలంగాణ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనేకమంది నిపుణులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువైనప్పటికీ.. పెరుగుతున్న కేసుల సంఖ్యతో పాటు ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు చూస్తే ముంచుకొస్తున్న కరోనా కల్లోలం కనపడుతుంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణలో కరోనా విలయతాండవం చేయబోతుందని లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో చేస్తున్న టెస్టులు, వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే పాజిటివ్ రేటు 15.10శాతం. మహారాష్ట్రలో 17.27శాతం, ఢిల్లీలో 17.31శాతం ఉండగా ఆ తర్వాత తెలంగాణ ఉంది. పైగా తెలంగాణలో టెస్టుల సంఖ్య అతి తక్కువగా ఉంది. టెస్టులు పెంచితే కేసులతో పాటు పాజిటివ్ రేటు కూడా భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. గత నాలుగైదు రోజులుగా ఇదే విషయం స్పష్టమవుతోంది.
కరోనా మరణాల రేటు కూడా తెలంగాణలో క్రమంగా పెరుగుతోంది. కరోనా మరణాల రేటు ఎక్కువగా గుజరాత్ లో 6.02శాతం ఉండగా, ఢిల్లీలో 3.45శాతం, మహారాష్ట్రలో 4.70శాతం, మధ్యప్రదేశ్ లో 4.28శాతం, పంజాబ్ లో 2.39శాతం, రాజస్థాన్ లో 2.34శాతం ఉండగా. తెలంగాణలో 2.30శాతం ఉంది. అంటే దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈ గణాంకాలు రాబోయే పెను ముప్పుకు సంకేతమని, టెస్టింగ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గణాంకాలు మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్లలో పారదర్శకత లేదనే విమర్శలున్నాయి. కనీసం వేల సంఖ్యలో కూడా కరోనా టెస్ట్‌లు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి కూడా రక్షణ లేకుండా పోయింది. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని వైద్యులు ఆందోళనకు దిగుతుంటే సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలున్నాయి. 10 లక్షల పీపీఈ కిట్లు, మాస్కులు అన్నారు. వాటిని ఎక్కడ పంపిణీ చేశారో తెలియదు. ఇప్పటికైనా సీఎం అబద్దాలు మాని వైద్యులు. పోలీసులు, జర్నలిస్టులలను, రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకుందాం…