
ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ రంజాన్. కరోనా దెబ్బతో ప్రతి ఏటా జరుపుకునే విధంగా ఈ సంవత్సరం రంజాన్ వేడుకలు జరుపుకోలేరు. మసీదు లలో ప్రార్ధనలు, ఇఫ్తార్ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్ బజార్ గాజుల గలగలలు ఈ ఏడు ముగ బోయాయి.హలీం తినాలన్నా..ఇఫ్తార్ విందుల చేయాలన్నా మరో ఏడాది ఆగాల్సిందే.
ఈ సంవత్సరం కోవిడ్19 ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో రంజాన్ సందర్భంగా జరిగే వ్యాపారం పూర్తిగా బంద్ అయింది. దేశంలోనే భాగ్యనగరంలో రంజాన్ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ముస్లింలు ప్రతి ఏటా ఈ పండుగను నెల రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దీనికి తగ్గట్లుగానే రంజాన్ మార్కెట్ భారీగా ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపురూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఒక అంచన. కానీ ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్ మార్కెట్ స్తంభించింది. పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్ గంజ్, ఘాన్సీబజార్, చార్ కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతిననున్నాయి. రంజాన్ మార్కెట్ లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్ బజార్, చార్ కమాన్, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్ గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోనున్నాయి.
అదేవిధంగా రంజాన్ మాసంలో మాత్రమే దొరికే హలీమ్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామంది హలీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హలీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.అంతేకాకుండా రంజాన్ మాసంలో సమయంలో తప్పకుండా తినాలనిపించే ఆహారపదార్థాలు చాలా ఉన్నాయి. హలీం, ఖుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, దహీవడ ప్రధానమైనవి. ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా ఏ హోటల్ లోనూ హలీం తయారు చేయరాదని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రతి రంజాన్ సీజన్ లో ఒక్క హైదరాబాద్.లోనే రూ.1200 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ మార్కెట్ అంతా స్థంభించిపోయింది.
లాడ్ బజార్ గాజుల గలగలలు,ఆంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన జానిమాజ్ ఎగ్జిబిషన్, అత్తర్ గుబాళింపులు, రుచికరమైన సెమియా, ఖుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, దహీవడ రుచులు, చికెన్, మటన్, బీఫ్, ఒంటె… మాంసాలతో తయారు చేసే హలీంలు, పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్ గంజ్, ఘాన్సీబజార్, చార్ కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్తు, వస్త్రాల కొనుగోలు ఇత్యాది కార్యాలకు కరోనా బ్రేక్ వేసింది. దింతో రంజాన్ కళ తప్పింది. 2021లో ఈ రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు బహుఘనంగా జరుపుకోవాలని ఆశిద్దాం..