“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చాడట” ప్రస్తుతం వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితి ఇలానే ఉంది. గ్యాస్ లీక్ అయ్యి విశాఖ వాసులు విషాదంలో ఉంటే.. వైసీపీ, టీడీపీ మధ్య రాజధాని పై రాజకీయ దుమారం రేగడం బాధాకరం.
“వైజాగ్ రాజధాని కావాలని కోరిన వైసీపీ నేతలకి బాగా జరిగిందంటూ కొందరు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. టీడీపీ నేతలే పెట్టినట్టుగా హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అవి మేము పెట్టలేదు వైసీపీ వాళ్ళే కావాలని దుష్ప్రచార నిమిత్తం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఊటంకిస్తూ.. టీడీపీ నేత నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై మండిపడుతూ పలు పోస్టులు పెట్టడం గమనార్హం. సేవ్ అమరావతి, మై క్యాపిటల్ అమరావతి పేరుతో హ్యాష్ ట్యాగ్స్ ఉన్న ఫేక్ ఫొటోలను లోకేష్ ట్వీట్ చేశారు.
గ్యాస్ లీకై విశాఖ వాసులు విషాదంలో వుంటే వైకాపా విషప్రచారానికి తెరలేపిందని నారా లోకేష్ పలు ట్వీట్లు చేయడం ఆశ్ఛర్యం. “పేటీఎం పుత్రులు కనీస మానవతాదృక్పథం లేకుండా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా ఫేక్ ట్వీట్లు వేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. “డబ్బులిస్తామంటే కన్నతల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విషప్రచారానికి దిగుతాయి. 5 రూపాయల కోసం రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టు పెట్టేందుకైనా వెనుకాడని పేటీఎం బ్యాచుల ఫేక్ ప్రచారానికి విజ్ఞతతో బదులిద్దాం..’ అని నారా లోకేష్ పలు ట్వీట్లు చేయడం ఆయన రాజధాని రాజకీయ క్రీడకు పరాకాష్ట!