
లాక్ డౌన్ ప్రారంభం నుండి నలుగుతున్న వలస కూలీల సొంత ఊళ్ళ ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు హోంశాఖ అనుమతివ్వడంతో రాష్ట్రాల సహకారంతో రైల్వేశాఖ మరిన్ని రైళ్లను నడపనుంది. కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ప్రొటోకాల్ పాటిస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయనున్నారు. రైళ్లు టికెట్లు, సామాజిక దూరం, ఇతర రక్షణ చర్యలకు సంబంధించి రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
ప్రయాణికులను పంపించేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. వలస కార్మికులను పంపే రాష్ట్రాలు విధిగా అందరినీ పరీక్షించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతించాలి. రాష్ట్ర ప్రభుత్వమే శానిటైజ్ చేసిన బస్సుల ద్వారా రైల్వే శాఖ సూచించిన స్టేషన్ వద్దకు ప్రయాణికుల చేరవేయాలి. బస్సుల్లో తరలించేటప్పుడు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్ల ప్రయాణంలో మధ్యలో ఎక్కడా స్టాప్స్ ఉండవు. పాయింట్ టు పాయింట్ మాత్రమే రైళ్లను నడుపుతారు. గమ్యస్థానం వచ్చిన తర్వాత.. సదరు స్టేషన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచాలి. అక్కడ మరోసారి పరీక్షలు చేసిన తర్వాత బస్సుల్లో ఎక్కించాలి. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలించాల్సి ఉంటుంది.