
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలోని ప్రజలందరూ తమ నివాసాలకే పరిమితమయ్యారు. అయినప్పటికీ దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిన్న (గురువారం) ఒక్కరోజే 90 కేసులు కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రోజు నాలుగు మరణాలతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 764 మంది కరోనాతో బాధపడుతున్నారు.
అయితే, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పాజిటివ్ గా స్పందించింది. ఈ లాక్‌డౌన్ ఫలాలు కనిపిస్తున్నాయని, ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. .
దేశంలో కొందరు రోగులకు ఆ వైరస్ ఎక్కడి నుంచి సోకిందో తెలియడం లేదని, అంతమాత్రాన దానిని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుంటే మాత్రం సామాజిక వ్యాప్తి తప్పదని హెచ్చరించారు.