
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడోవ దశ లాక్ డౌన్ ఈ నెల 17 తో ముగియనుంది.18వ తేదీ నుంచి నాలుగో దశ లాక్ డౌన్ అమలు కానుంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్4.0లో ఎటువంటి ఆంక్షలను ఎత్తివేస్తారు, ఎక్కడెక్కడ సడలింపులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. నాలుగో దశ లాక్ డౌన్ కొత్త రూపంలో ఉంటుందని ఇటీవల ప్రధాని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు హాట్ స్పాట్ కాని జోన్లలో లోకల్ బస్సులు నడిపే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ద్వారా తెలుస్తుంది. ఆటోలు, ట్యాక్సీలను కూడా ప్రయాణికుల సంఖ్యను కుదించి నడపనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బస్సులను నడుపనున్నారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్నవారు మాత్రమే మరో రాష్ట్రానికి బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
దేశీయ విమాన సర్వీసులను కూడా వచ్చే వారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం నిత్యావరస వస్తువులే కాదు, ఇక నుంచి అన్ని రకాల వస్తువులకు హోం డెలివరీ అవకాశం కల్పించనున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వైరస్ సంక్రమించే అవకాశాలు అన్ని కోణాలపై కేంద్రం దృష్టి సారించనుంది.