ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో ఇళ్ళ పట్టాలపై కుంభకోణం జరిగిందంటూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. బూరుగుపూడికి చెందిన రైతు వేసిన ఈ పిటిషన్ లో 600 ఎకరాల భూమి కొనుగులులో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. తూర్పుగోదవరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో ఎకరం రూ. 7.20 లక్షల విలువ చేసే భూమికి ప్రభుత్వం రూ. 45 లక్షలు చెల్లించింది. అదేవిధంగా ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాలకు ఇస్తున్నారని, ఆ కొనుగోలులో, ఆరు రెట్లు అధిక ధర ఇచ్చారంటూ, కోర్ట్ దృష్టికి తెచ్చారు పిటీషన్ తరుపు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు. అధికారులు, నాయకులు కుమ్మక్కు అయ్యి ప్రజాధనం వృధా చేసారని చెప్పారు. అక్కడున్న 20 అడుగులు లోతు గుంతలు పుడ్చాలంటే వందల కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని కోర్ట్ కు తెలిపారు.
ఈ విషయంలో హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భూములు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరుపు వాదనలను అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇలాంటి కేసు పై దక్షిణ ఆఫ్రికాలో జడ్జిమెంట్ లను ఆయన ప్రస్తావించారు. అయితే సుప్రీం తీర్పులే దీని పై ఉదాహరణగా ఉన్నప్పుడు, ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకుని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తమకు కౌంటర్ దాఖలు చెయ్యటానికి సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరటంతో కేసును హైకోర్ట్ వాయిదా వేసింది.
రాజమండ్రి అర్బన్, రూరల్ మండల ప్రాంతంలోని 42,742 మంది పేదలైన లబ్దిదారులకు నవరత్నాలు పేరిట ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది మన ప్రభుత్వం. ఈ మేరకు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లభ్యం లేకపోవడంతో రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, కోరుకొండ మండలంలో 177 ఎకరాల్లో ఉన్న ఈ ఆవ భూములు కొనుగోలు చేసే విధంగా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. ఈ భూములు గోదావరి ప్లడ్ ఎఫెక్ట్డ్ ల్యాండ్ ప్రాంతంగా ఉందని మార్చి 9 వ తేదీన జలవనరుల శాఖ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ ఒక లేఖ కూడా రాసారు. జలవనరులశాఖ నివేదిక ఇచ్చినా అధికారులు పక్కన పెట్టేశారు.