ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పలు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ.. కరోనా కట్టడి పై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కానీ ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాకపోవడం గమనార్హం. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు అప్పుడప్పుడు బయటకొచ్చి కరోనా కట్టడిపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం తన ఇంటికి, ఆ క్యాంప్ ఆఫీసుకి మాత్రమే పరిమితమయ్యారు.
“నాలుగు పదుల వయసున్న జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు కదల్లేని స్థితి లో ఉన్నారా? జగన్ ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు. ఆయన రాష్ట్ర నికి ముఖ్యమంత్రా లేక తాడేపల్లి కి ముఖ్యమంత్రా? ప్రజలకు ముఖ్యమంత్రా? ప్యాలెస్ కి ముఖ్యమంత్రా?” అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. “రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే జగన్ మాత్రం ఏమీ పట్ట నట్లు ఇంట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి కరోనాకి భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి పబ్జీ గేమ్ పై ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరం.” అంటూ వివిధ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
కరోనా నివారణలో వైసీపీ పని తీరును చూసి జనం తిరగబడతారేమోనని బయటకు రాలేకపోతున్నారా? కరోనా విపత్తు సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, కేరళ ముఖ్యమంత్రి విజయన్ వంటి వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బాధితులు, వలస కార్మికులు, రైతులు ఇతర వర్గాలవారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఏపీలో మరింత ఘోర కలి రాకముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని పలువురు సలహాలిస్తున్నారు.