ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాల్లో తన ఉనికిని చాటుకుంటూ విలయం సృష్టిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. దాంతో అనేక దేశాల ప్రజలు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలు విదేశీయులను తమ భూభాగంపై ఉండేందుకు అనుమతించడంలేదు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇటీవలే భారత్ నుంచి 444 మంది తమ పౌరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లింది.అయితే మరికొన్ని దేశాలకు చెందిన ప్రజలు మాత్రం భారత్ ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా అమెరికన్ల గురించి చెప్పుకోవాలి. తాము భారత్ లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడమే అందుకు కారణం. 22 వేలు దాటిన మృతుల సంఖ్య, ఐదున్నర లక్షల పాజిటివ్ కేసులతో అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది.
విదేశాల్లో ఉన్న 50 వేల మంది అమెరికా పౌరులను స్వదేశానికి వచ్చేయాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ ఆదేశాలతో అమెరికా యంత్రాంగం అనేక విమానాలను నడుపుతోంది. విదేశాల్లో నిలిచిపోయిన అమెరికన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్ లో తమకు అందుబాటులో వున్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని కోరితే, వారిలో 10 మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా భారత్ లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండడమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది.
కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా.