Homeజాతీయ వార్తలుసైరా నరసింహారెడ్డి సినిమా చరిత్రాత్మకం

సైరా నరసింహారెడ్డి సినిమా చరిత్రాత్మకం

సైరా నరసింహారెడ్డి గురించి తెలిసిన వాళ్ళు బహు అరుదనే చెప్పాలి. వీర పాండ్య కట్టబొమ్మన్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వాళ్ళు ఎలా లేరో నరసింహారెడ్డి గురించి తెలిసిన వాళ్ళు అలానే లేరు. మరి ఇలా చరిత్ర మరుగునపడిన వాస్తవాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ముందుగా ఇంతటి ధీరుడి చరిత్రను అందరిముందుకు తీసుకొచ్చినందుకు చిత్ర నిర్మాతకు, దర్శకునికి, కధని రసవత్తరంగా చెప్పిన పరుచూరి బ్రదర్స్ కి , అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాని అన్నీ తానై ప్రోత్సహించిన చిరంజీవికి అభినందనలు. చిరంజీవి అనగానే స్టెప్పులు, హాస్యం ప్రధానపాత్ర పోషిస్తాయి. అటువంటిది ఓ చారిత్రాత్మక సినిమా ని ఇంత పెద్దఎత్తున తలపెట్టటం గొప్ప సాహసమేనని చెప్పాలి. ఓ తెలుగువాడు భారత స్వాతంత్రపోరాటంలో ఇంతటి చరిత్ర సృష్టించాడని తెలియటం మనందరికీ గర్వకారణం.

ఇక సినిమా సంగతి చెప్పాల్సివస్తే ఇది అన్ని కోణాల్లో అద్భుతమైనదిగా చెప్పాలి. రాయలసీమ పాలెగాళ్ళ ను గురించి, అప్పటి సామాజిక పరిస్థితులు, అంశాలగురించి, అన్నింటికన్నా ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దౌష్ట్యాల గురించి తెలుసుకోవాలనుంటే ఈ సినిమా ఉపయోగపడుతుంది. బ్రిటిష్ వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు, నీచపు ఎత్తుగడలతో భారతదేశ ప్రజల్ని ఎలా లోబర్చుకుందీ తెలిపే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. అల్లూరి సీతారామరాజు పోరాటం మన్యపు గిరిజనుల్ని సంఘటిత పరిస్తే నరసింహారెడ్డి సీమ ప్రజానీకాన్ని సంఘటితపరిచాడు. బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనటానికి పాలెగాళ్లను ఐక్యపరచటమే కాకుండా అప్పట్లోనే ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళను కూడా జతపరిచి ఉద్యమం నిర్మించటం గొప్పవిషయం.

సినిమా సహజసిద్ధంగా అప్పటికాలపు కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చిరంజీవి చారిత్రక పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తం అన్నీ తానై నడిపించాడు. కొంతమంది విమర్శకులు సినిమా మొత్తం తనపాత్రనే ప్రధానంగా చూపించారని చెప్పటంలో అర్ధంలేదు. ఆ కధలో నరసింహారెడ్డి నే అన్నే తానై నాయకత్వం వహించాడు కాబట్టి అలా చూపించకపోతేనే తప్పయివుండేది. సినిమా చూసినంతసేపు ప్రేక్షకులకు బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతోపాటు దేశభక్తితోరగిలిపోయారని చెప్పొచ్చు. నరసింహారెడ్డి సాహసాలు, తెగువ, చొరవ ప్రతిఒక్క భారతీయుడికి ఆదర్శం కావాలి. ఈ సినిమా వలన నరసింహా రెడ్డి చరిత్ర తెలియటంతో పాటు , భారతీయుల్లో ఇంకొక్కసారి జాతీయభావాలు రగిలినాయని చెప్పొచ్చు. ఈ పాత్రలో చిరంజీవి నరసింహారెడ్డి ఎలావుంటాడో తెలియదుకానీ చిరంజీవిలాగా ఉంటాడని అనుకునేటట్లు చేశాడు. సినిమాకోసం మెగాస్టార్ హోదాను పక్కనపెట్టి ఎంతో శ్రమ పడ్డాడని , నరసింహారెడ్డి సాహసాన్ని, ఆవేశాన్ని చక్కగా ప్రదర్శించాడని ఘంటాపధంగా చెప్పొచ్చు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని పుస్తకంగా తీసుకొస్తే కొద్దిమందే చదువుతారు. అదే సినిమా తీస్తే ఎన్నో లక్షలమంది చూడటమే కాకుండా దానితో ఉత్తేజితమవుతారు. ఇందులో మిగతా పాత్రధారుల గురించి చెప్పాల్సివస్తే తమన్నా, నయనతార, అనుష్కా పాత్రలు చిన్నవైనా మరుపురానివి. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటించటం సినిమాకే ఓ మణిపూస. అవుకురాజు పాత్ర ని చాలా బాగా తీర్చిదిద్దటమే కాకుండా ఆ పాత్రలో సుదీప్ అద్భుతంగా చేసాడు. జగపతిబాబు చక్కగా మెప్పించాడు. ప్రతికోణంలోనూ ఈ సినిమా అప్పటి చరిత్రను చక్కగా ప్రతిబంబించింది. ఈ అనుభూతిని చెప్పేదానికన్నా చూస్తేనే వందశాతం అనుభవించగలరనిపిస్తుంది. మొత్తం మీద ఈ చారిత్రక సినిమా చరిత్రాత్మకమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version