
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిన్న ఏర్పాటు చేసిన కాబినెట్ మీటింగ్ లో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయిచినట్లు తెలిసిందే. అయితే ఈ రోజు రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. అనేక చోట్ల మీడియాతో మాట్లాడిన కార్మికులు కెసిఆర్ నిర్ణయానికి ఆనంద వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది, కానీ 52రోజుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమి లేకపోగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ జేఏసి నేతలు తప్పు దారిలో వెళ్లారనేది వాస్తవం. మరోవైపు కెసిఆర్ కూడా మెట్టు దిగక పోవడంతో పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అంటే కెసిఆర్, జేఏసి నేతలు పంతాలకుపోయి టీఎస్ఆర్టీసీకి వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ప్రజలు భరించాలి అని చావు కబురు చల్లగా చెప్పారు మన ముఖ్యమంత్రిగారు. “మన బిడ్డలు” “మన వాళ్ళు” “మనమెలా పోగొట్టుకుంటామంటూ” తియ్య తీయగా మాట్లాడి నష్టాన్ని మొత్తం ప్రజల మీదికి నెట్టారు. కిలోమీటర్ కి 20పైసలే పెంచుతున్నాం అని భలేగా మాట్లాడారు. దానివల్ల ఆర్టీసీ ఏడాదికి 752కోట్లు ఆదాయం చేకూరుతుందని కమ్మగా.. ప్రజలకు దెబ్బ తగలకుండా చెప్పారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సొమ్మంతా ఎక్కడ నుండి వచ్చింది? అదంతా రాష్ట్ర ప్రజలు వివిధ రూపాల్లో ఇచ్చిన సొమ్మే కదా? అదే ఉపయోగిస్తే బాగుంటది కదా? మరింత భారాన్ని ఎందుకు ప్రజల మీద మోపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిలో దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక మిస్టరీ. ఎన్ని లక్షల ఎకరాలకు నీరొస్తుందో ఇప్పటికీ తెలియదు. ఇంతగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.. ఈ ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే కదా? ఇవన్నీ సరిపోవన్నట్లు మరలా కొత్తగా ప్రజల మీద అదనపు భారం పెట్టటం సబబా? ప్రియమైన ముఖ్యమంత్రిగారు…?
ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టే ఈ వీడియో సాంగ్ లో చివరికి “వీడు వాడ్ని తిట్,టి వాడు వీడ్ని తిట్టి చివరకు జనాలకు పిచ్చి పట్టింది” వినండి
