
రామ్ మాధవ్ బీజేపీ లో కీలకనేత. ఎక్కడ సమస్యవున్నా పార్టీ తన సేవల్ని ఉపయోగించుకుంటుంది. కాశ్మీర్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, పిడిపి ఇటు జమ్మూలో ,అటు లోయలో పెద్ద పార్టీలుగా అవతరిస్తే పార్టీ రామ్ మాధవ్ ని పంపించి బద్దవిరోధులైన రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచింది. అలాగే ఈశాన్య ప్రభుత్వం లో ఏ సమస్య వచ్చినా రామ్ మాధవ్ వెళ్లి పరిష్కరిస్తారు. అంతటి ప్రాముఖ్యత వున్న నేత రామ్ మాధవ్. అక్షరాలా కోనసీమ గర్వపడేలా దేశంలో ఓ పెద్దనేతగా మన తెలుగు నేలకు సంబందించిన వ్యక్తి వున్నత స్థానంలోకి వెళ్ళటం తెలుగు వాళ్లందరికీ సంతోషం. అయితే రామ్ మాధవ్ పై నెగటివ్ గా కూడా ఇమేజ్ వుంది. తెరచాటు వెనుక రాజకీయాలు చేయటంలో ఆరితేరిన వ్యక్తిగా పేరు రావటం తన వ్యక్తిత్వానికి మచ్చ గానే చెప్పాలి.
ఇటీవల రామ్ మాధవ్ ని తానా సభలకు వాషింగ్టన్ కి ఆహ్వానించారు. తెలుగు వాళ్లలో పేరు ప్రఖ్యాతులు వున్న వ్యక్తిగా రామ్ మాధవ్ ని ఆహ్వానించారు. అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికినట్లు తెలిసింది. అదే రామ్ మాధవ్ విషయంలో నిర్వాహకులు స్వాగతం పలికినా తాను మాట్లాడేటప్పుడు సభలో నిరసన తెలిపారు. సభలకు హాజరైన సభ్యులు రామ్ మాధవ్ విషయంలో అంత సద్భావన లేకపోవటమే ఇందుకు కారణం. తానా సభ్యులు ఇక్కడ ఆంధ్రా రాజకీయాలకు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందరూ అనుకుంటున్నట్లు గానే కమ్మ సామాజిక వర్గం వ్యక్తుల ప్రభావం ఈ సంఘంలో ఎక్కువగా వుంటుందనే విషయం ఇప్పుడు రుజువయ్యింది. రామ్ మాధవ్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పై ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఒకసారి సభకు ఆహ్వానించిన తర్వాత మర్యాదగా చూసుకొని పంపించాల్సిన భాద్యత నిర్వాహకులూ, సభ్యులపై ఉంటుంది. సభకు పిలిచి అవమానించటం మర్యాద అనిపించుకోదు. సహజంగా ఏ నాయకుడిని పిలిచినా గౌరవించి పంపిస్తుంటారు. కానీ రామ్ మాధవ్ విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఆంధ్రాలో, తెలుగు దేశం , ప్రచార సాధనాలు బీజేపీ పై చేసిన ప్రచారం, తెలుగు దేశం ఓడిపోవటంలో బీజేపీ పాత్ర ఉందని భావించటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా తానా ఒక వర్గానికి కాపుకాసే సంఘం గా దీనితో మరొక్కసారి ముద్రపడింది.