
తెలంగాణ లో మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. అయితే హైకోర్టు తీర్పుని బట్టి తుది నిర్ణయం ఉంటుంది. కెసిఆర్ రాజకీయ చాణిక్యుడు కాబట్టి తన దృష్టిలో ఆలస్యం అయ్యేకొద్దీ నష్టం జరిగే అవకాశముందని భావిస్తున్నాడు. అందుకే ప్రతిపక్షం తేరుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే లోపలే పూర్తి చెయ్యాలనే పట్టుదలతో వున్నాడు. హైకోర్టు బ్రేకు లేయకపోతే తన పాచిక పారే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.
ఇప్పుడు అందరి దృష్టి ప్రతిపక్షంపై వుంది. తెరాస కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ ల్లో ఎవరు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారనే దానిపైనే ఆసక్తి నెలకొంది. మొన్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణాలో బీజేపీ, దక్షిణ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగాయి. అయితే ఆ తర్వాత జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా రాజీనామా చేయటం, తెలంగాణాలో 16 మంది శాసనసభ్యుల్లో 12 మంది తెరాస లో చేరటం , గోవా లో మెజారిటీ సభ్యులు బీజేపీ లో చేరటం లాంటి పరిణామాలు కాంగ్రెస్ నైతిక స్థాయిని దెబ్బ తీశాయనే చెప్పాలి. బీజేపీ ప్రస్తుతం దక్షిణ తెలంగాణ లో కూడా పాగా వేయటానికి అన్ని పావులు కదుపుతుంది. మునిసిపల్ ఎన్నికల లోపే చాలా మంది ని తమవైపు లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ బీసీ లు, ముస్లింలను తనవైపు ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టింది. వారికీ మొత్తం సీట్లలో సగం ఇస్తానని ప్రకటించింది. అయితే నావ మునిగేటప్పుడు అందులోకి దూకటానికి ఎవరూ ప్రయత్నించరు. అందునా పట్టణ ఓటర్లలో బీజేపీ కి సహజంగానే కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కాబట్టి ఈ ఆకర్షణ ప్రయత్నాలతో పెద్ద ప్రయోజనం ఉండక పోవచ్చు. మునిసిపల్ ఎన్నికలతో బీజేపీ తెరాస కు ప్రత్యామ్నాయంగా అవతరించే అవకాశాలు మెండుగా వున్నాయి. బీజేపీ ప్రస్తుతం అంతటితో సంతృప్తి చెందక తప్పదు. ఈ ఎన్నికల్లో కూడా తెరాస తన ఆధిక్యత ప్రదర్శిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. కాంగ్రెస్ భవిష్యత్తు పైనే సస్పెన్స్ కొనసాగుతుంది . మునిసిపల్ ఎన్నికలతో దాని ఆశలు చల్లారి రాజకీయ పునరేకీకరణ కు నాంది పలుకుతుందని అందరూ భావిస్తున్నారు.