
జగన్ నిర్ణయాలు ప్రజారంజకంగా ఉంటున్నాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అడిగిన వాళ్లకు , అడగని వాళ్లకు కావాల్సినన్ని వరాలు ప్రకటిస్తున్నాడు. ఈ చర్యలన్నీ వినటానికి బాగానే వున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వీటి ప్రభావం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఏ మేరకు ఉంటుందనేది తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మొత్తం ఎన్నికల వాగ్ధానాలు మొదటి సంవత్సరంలోనే అమలు చేయాలనే తాపత్రయం కనబడుతుంది. ఉద్దేశాలు మంచివే అయినా అమలులో వచ్చే ఆర్ధిక ఇబ్బందులను గురించి సమీక్షచేస్తున్నట్లు కనిపించటంలేదు. డబ్బులుంటే స్వర్గానికి నిచ్చెనలేయొచ్చనే సామెత వూరికే రాలేదు.
ఒకవైపు తాహతుకు మించి ఖర్చుచేసుకుంటూ పోతున్నాడు. రెండోవైపు ప్రపంచ బ్యాంకు , చైనా ముఖ్యకార్యాలయం తో కూడిన ఆసియా బ్యాంకు రుణాలు ఇవ్వలేమని చేతులెత్తేసినాయి . ఇది ఆందోళన కల్గించే అంశం . సాంఘిక ప్రచార మాధ్యమాల్లో కేంద్రం పెద్దఎత్తున ఆర్ధిక సహాయం చేయబోతోందని ప్రచారం జరుగుతుంది. అది కేవలం వూహాజనితమే . ఎందుకంటే కేంద్రం దాని పధకాలకే డబ్బులులేక ఇబ్బందిపడుతూ ఉంటే ఆంధ్ర కు అన్నివేల కోట్లు, ఇన్నివేలకోట్లు సహాయం ప్రకటిస్తుందనే ప్రచారం కేవలం అత్యాశే. కొన్నాళ్ళు పోయిన తర్వాత చూసారా కేంద్రం మొండిచేయి చూపించింది, సవతితల్లి ప్రేమ చూపించిందని ప్రచారం మొదలుపెడతారు. ఆంధ్ర ప్రజలను ఇలా మోసం చేయటం మొదట్నుంచి జరుగుతుంది. గత అయిదు సంవత్సరాలు ఇలాంటి ప్రచారమే చేసి ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పటికైనా వాస్తవప్రపంచం లోకి వచ్చి భూమి మీద నడవటం నేర్చుకుంటే మంచిది.
ఈ నేపథ్యంలో జగన్ ఇంకో ప్రజాకర్షక నిర్ణయం తీసుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే నిబంధన పెడుతూ శాసనం తీసుకొచ్చాడు. దేశం మొత్తం మీదా ఇటువంటి చట్టం తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు . ఈ నిర్ణయం పైకి చూట్టానికి బాగానేవున్నా దీనివలన అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం వుంది. ప్రైవేటు పెట్టుబడులు రావటానికి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చి ఆహ్వానిస్తున్న సందర్భంలో ఇటువంటి నిబంధన వలన వచ్చే పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదముంది. అసలే కొత్త రాష్ట్రం. ప్రధానంగా వ్యవసాయ రంగం ఫై ఆధారపడిన రాష్ట్రం. వేగంగా పారిశ్రామీకకరణ వైపు అడుగులు వేయాలంటే ఇటువంటి నిబంధనలు అడ్డుగా నిలుస్తాయి. రెండోది, ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒకనాడు శివసేన ముంబై లో ఇటువంటి డిమాండ్లే పెడితే దేశవ్యాప్తంగా నిరసనలు రావటంతో ఆత్మరక్షణలో పడింది. తిరిగి ఈ నిర్ణయంతో జగన్ దేశవ్యాప్త చర్చకు కారణమయ్యాడు. ఏ కారణంతో చూసినా ఈ చర్య సమర్ధనీయం కాదు. దీనివలన దేశవ్యాప్త అప్రతిష్టను మూటకట్టుకోవటంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అనాలోచిత, దుస్సాహిత నిర్ణయాలవలన దీర్ఘకాలంలో ఆంధ్ర ప్రజలు నష్టపోతారనేది ఎంతతొందరగా గ్రహిస్తే అంతమంచిది. జగన్ భాయ్ జర సోచో , సోచ్ కే కరో.