Homeజాతీయ వార్తలుముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం!

ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం!

జనవరి 3 (శుక్రవారం) ఒక సంచలన వార్త వింటూ పలు దేశాల్లో ప్రజలు వణికిపోయారు. ఇరాన్ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేసిన రాకెట్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇరాన్‌లో రెండో అత్యంత శక్తిమంతమైన నేత ఖాసీం సులేమాని ఈ దాడిలో హతమవడమే ఈ ఆందోళనకు కారణం. ఇరాన్‌ రివల్యూషనరీ గార్ట్స్‌లోని ఆత్యంత శక్తిమంతమైన ‘ఖుద్స్‌ ఫోర్స్‌’కు జనరల్‌గా వ్యవహరిస్తున్న ఖాసీం సులేమానికి.. ఇరాన్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సులేమాని అనుచరులు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నారు.

ఈ విషయంపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖామేనీ… స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్‌ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్‌కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

అమెరికాతో ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరాన్.. సులేమాని హత్యతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఇరాన్‌కు పొరుగు దేశాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాక్ దేశాల్లో సులేమాని అనుచరులు, అతడిని అభిమానించే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా అమెరికాపై ప్రతీకార దాడులకు దిగవచ్చని భావిస్తున్నారు.

ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధమే వస్తే.. ప్రపంచం రెండుగా విడిపోతుంది. అగ్రరాజ్యానికి అండగా పలు దేశాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారీ విధ్వంసం తప్పదు. ఈ వార్తలతో పలు దేశాల్లో సామాన్య జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గూగుల్‌లో, అటు సోషల్ మీడియాలో ‘వరల్డ్ వార్ 3’ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మూడో ప్రపంచ యుద్ధం రాకపోయినా.. 2001 సెప్టెంబర్ 11 తరహా దాడులు జరగవచ్చేమోనని అమెరికన్లను భయం వెంటాడుతోంది. ఇరాక్ వదిలి వెళ్లిపోవాలంటూ బాగ్దాద్‌లో యూఎస్ ఎంబసీ అమెరికన్లను హెచ్చరించింది.

మూడో ప్రపంచ యుద్ధం, ఇరాన్ పేరుతో చాలా మంది గూగుల్‌లో శోధిస్తున్నారు. గూగుల్‌లో శుక్రవారం అత్యధిక మంది సెర్చ్ చేసిన రెండో పదం ఇరాన్ కావడం గమనార్హం. అమెరికాలోనే ఈ పదాన్ని అత్యధిక మంది శోధించడం మరో విశేషం. ఇక ఇరాన్‌పై అమెరికా రాకెట్ లాంచర్ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే గూగుల్‌లో‘వరల్డ్ వార్ 3’ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విటర్‌లో మాత్రం ఎక్కువ మంది ఈ అంశంపై సరదా మీమ్స్ పెడుతున్నారు.

రాకెట్ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

రెండు రోజుల కిందట ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

ఇరాన్ – అమెరికా మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన చర్యల వెనుక సులేమాని కీలకంగా వ్యవహరిస్తు వచ్చారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular