Homeజాతీయ వార్తలుకెసిఆర్ Vs జగన్

కెసిఆర్ Vs జగన్

రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలనలో ఎవరిపంధాలో వాళ్ళు వెళ్తున్నారు. కెసిఆర్ మూడు నెలల ముందుగానే రెండోసారి అధికారం చేపట్టాడు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. ఈ కొద్ది సమయంలోనే ఇద్దరి పరిపాలనలో తేడాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. నాలుగు నెలలు చాలా తక్కువ సమయమైనా ఈ నాలుగు నెలల్లోనే కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఇద్దరి మధ్య సామీప్యతలేమిటో చూద్దాం. మనస్తత్వం రీత్యా ఇద్దరూ చాలా ఫర్మ్ గా వుంటారు. వాళ్ళు అనుకున్నది అమలుచేయటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖాతరు చేయరు. అది గట్టి నాయకత్వానికి చిహ్నం. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఈ లక్షణం ఒక్కోసారి బెడిసి కొడుతోంది. ఇకపోతే ఇద్దరూ పత్రికా స్వేచ్ఛను నియంత్రించాలనే చూస్తారు. కెసిఆర్ రాంగానే టీవీ 9, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి చానళ్లను బ్యాన్ చేస్తే జగన్ టీవీ 5, ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి చానళ్లను బ్యాన్ చేసాడు. మూడో కామన్ పాయింట్ ఇద్దరూ తమ స్వంత ఐడియాలను అమలుచేయాలని చూస్తారు. కెసిఆర్ రైతుబంధు లాగే జగన్ గ్రామ సచివాలయ నమూనాను తీసుకొచ్చాడు. నాలుగోది ఇద్దరూ సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయిదోది, ఇద్దరూ కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తారు. కెసిఆర్ ఏకంగా కుటుంబ పరిపాలననే తీసుకొచ్చి పెడితే జగన్ తన తండ్రి పేరుమీదే రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

ఇక వైరుధ్యాలు చూస్తే కొన్ని కొన్నింటిలో బాగానే తేడా వుంది. కెసిఆర్ ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తుంటే జగన్ ఆదాయం పోయినా పర్వాలేదు మద్యాన్ని నియంత్రించాల్సిందేనని దృఢంగా వున్నాడు. రెండోది, జగన్ విద్యారంగంపై శ్రద్ధాశక్తులు బాగాచూపిస్తుంటే కెసిఆర్ దాని ఊసే ఎత్తటం లేదు. మూడోది, ఆర్టీసీ విషయంలో జగన్ ఏకంగా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే కెసిఆర్ ఆర్టీసీ కార్మికులపై కత్తి ఝుళిపించాడు. విలీనం ప్రసక్తే లేదంటున్నాడు. కెసిఆర్ రెండోసారీ ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటిస్తే జగన్ రుణ మాఫీకి బద్ధవ్యతిరేకంగా వున్నాడు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని దీర్ఘకాలంగా నడిపి నాయకుడిగా నిరూపించుకున్నాడు కానీ జగన్ నాయకుడుగా సక్సెసా ఫేయిల్యూరా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్ళు వేచిచూడాల్సి వుంది. అలాగే జగన్ భవిష్యత్తు కోర్టు కేసుల వలన అనిశ్చితి గా ఉంటే కెసిఆర్ నిండుకుండలాగా భవిష్యత్తు ఉండటం వలన కొడుకుని సీటు పై ఎలా కోర్చోబెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఎవరి ప్రత్యేకతలు వాళ్లకు వున్నాయి. ఇంకో ఆర్నెల్లయినా గడిస్తేగాని వివరంగా పోలిక చేయటం కుదరదు. అప్పటివరకూ ఈపోలికలతో సరిపెట్టుకుందాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular