
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జగన్ కులం ఆయన మతంపై జనసేన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. అలాగే ఏపీ ప్రభుత్వ పాఠశాలలో “ఇంగ్లీష్ మీడియం” తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు సీను మారింది. ఇటు టీడీపీ నేతలు అటు జనసేన పార్టీ నేతలు “ఇంగ్లీష్ మీడియం”పై మరియు జగన్ కుల, మత వ్యవహారాలపై యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
గతంలో ఏపీ రాజధాని “అమరావతి” నుండి “వినుకొండ”కు మారుస్తున్నారని పెద్ద ఎత్తున దుమారం లేచినప్పుడు సీఎం జగన్ మౌనంగా ఉన్నారు కానీ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రాజధానిపై ప్రతిపక్షాలు మాట్లాడక పోయినా.. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుతో రాజధాని టాపిక్ తీసుకొచ్చి ఆ తర్వాత 9మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన తర్వాత జగన్ ఈ మూడు రాజధానుల విషయం బయట పెట్టారు. అంటే జగన్ కావాలనే ఈ 3రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అప్పటివరకు “ఇంగ్లీష్ మీడియం”పై, కుల-మత విమర్శలతో బిజీగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు సడెన్ గా మారిపోయి చక్కగా వెళ్ళి ధర్నాలో కూర్చుంటున్నారు. ఇది సీఎం జగన్ మైండ్ గేమ్ అనుకోవచ్చా..!?
ఇదిలా ఉండగా ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. “ఏపీకి 3రాజధానులు” ప్రతిపాదన టీడీపీ, జనసేన పార్టీలకి తలనొప్పి అని చెప్పొచ్చు. జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొడితే, అమరావతి రైతులు, ప్రజలు ఒప్పుకోరు అలాగే ప్రతిపాదనను తిరస్కరిస్తే కర్నూల్, విశాఖ ప్రజలలో నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఈ విధంగా “ముందు కెళ్తే గొయ్యి వెనకెళ్తే నుయ్యి” అన్నట్లు ఉంది టీడీపీ, జనసేనల పరిస్థితి. ఎటు నుంచి చూసినా జగన్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అమరావతి రాజధాని అలాగే ఉంచారు మరియు కర్నూల్, విశాఖ ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ రాజకీయ వ్యహం బాగుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.