
అనుకున్నంతా అయ్యింది. 1980 రెండవ జాతీయకరణ సమయం లో ఆంధ్ర బ్యాంకు ని జాతీయం చేయటం జరిగింది. అప్పుడు కూడా మనకు అన్యాయం జరిగింది. పంజాబీల బ్యాంకు అయిన పంజాబ్ & సింధ్ బ్యాంకు కూడా ఆంధ్ర బ్యాంకు తో పాటు జాతీయం చేయబడింది. ఇందిరా గాంధీ ఆ టైములో పంజాబీలకు హామీ ఇచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాంకు అస్తిత్వానికి దెబ్బతగలకుండా కాపాడతానని చెప్పింది. చెప్పటమే కాకుండా చట్టం లోకూడా ఆ హామీని నెరవేర్చింది. ఎలానంటే ఆ బ్యాంకు చైర్మన్ గా పంజాబీలనే నియమించాలని చట్టం లో రాసుకున్నారు. కానీ ఆంధ్ర బ్యాంకు విషయం కి వచ్చేసరికి ఇక్కడి రాజకీయనాయకులు ఒత్తిడి తేలేదు. ఇందిరా గాంధీ ఎటువంటి హామీని ఇవ్వలేదు. మొత్తం బ్యాంకు చరిత్రలో జాతీయం చేసిన తర్వాత ఇద్దరు తెలుగు వాళ్ళే చైర్మన్లు గా చేసారు. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ వెంకట రత్నం గారు, రెండు బ్యాంకర్ అయినటువంటి ఆర్ ఎస్ రెడ్డి గారు. అంతకుమించి ఇంతవరకు బయటివ్యక్తులే చైర్మన్లుగా వచ్చారు. ఎందుకుచెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్ర బ్యాంకు అప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ బ్యాంకు గానే వుంది. అయినా దీని ప్రాంతీయ అస్తిత్వానికి గుర్తింపులేదు.
ఇప్పుడు జరిగిన బ్యాంకుల ఏకీకరణ లో కూడా మరలా అన్యాయం జరిగింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాలుగు ప్రాంతాల్లో నాలుగు బ్యాంకుల్ని ప్రాంతీయ అస్థిత్వాన్ని గుర్తిస్తూ వాటిని అలాగే కొనసాగిస్తున్నామని చెప్పింది. అవి దక్షిణాదిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, తూర్పున యూకో బ్యాంకు, ఉత్తరాన పంజాబ్ & సింధ్ బ్యాంకు , పశ్చిమాన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర గా ప్రకటించింది. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే దక్షిణాన తమిళుల, తూర్పున బెంగాలీల, ఉత్తరాన పంజాబీల , పశ్చిమాన మహారాష్ట్రుల అస్థిత్వాన్ని గుర్తించారు. కానీ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తెలుగు ప్రజలకు వున్న ఒకేఒక బ్యాంకును కొనసాగించాలనే భావన తెలుగు కోడలైన నిర్మల సీతారామన్ కి తోచలేదు. అదే అవినీతి మరకలు అంటిన ఐఓబీ ని కొనసాగించటానికి మనసొప్పింది. అదేకాదు అలాహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు విలీనం లో పెద్దదైన అలాహాబాద్ బ్యాంకు కాకుండా ఇండియన్ బ్యాంకు ని లీడ్ బ్యాంకు గా ప్రకటించింది.
ఇది ప్రాంతీయ దురభిమానం రెచ్చకొట్టటానికి చెబుతుంది కాదు. అంతకుముందే ఎస్ బి ఐ అనుబంధ బ్యాంకుల విలీనం లో హైదరాబాద్ కేంద్రంగా వున్న స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ ని విలీనం చేశారు. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ని కూడా విలీనం చేశారు. ఎందుకు చెప్పాల్సివస్తుందంటే ఆంధ్ర బ్యాంకు జాతీయ బ్యాంకు అయినా ఇప్పటికీ సగం శాఖలు, సిబ్బంది తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళే. అందువలన మిగతా రాష్ట్రాల అస్తిత్వం కాపాడామని చెప్పినప్పుడు తెలుగు వాళ్ళ అస్తిత్వం ఎందుకు గుర్తుకు రాలేదనేదే అంతుచిక్కని ప్రశ్న. అదీ మనకు చెందిన ఆర్ధికమంత్రి వుండి కూడా. దురదృష్టమేమంటే మన రాజకీయనాయకులు ఇటువంటి విషయాలు పట్టించుకోరు. ఒకరినొకరు తిట్టుకోవటానికే వాళ్ళ టైమంతా సరిపోతుంది. మరి మన ప్రయోజనాలు పట్టించుకొనే వాళ్లెవరు?