
ఆరు నెలల జగన్ పరిపాలన ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించింది. సంక్షేమమంటే ఏంటో జగన్ చూపిస్తున్నాడు. ఓ విధంగా వాళ్ళ నాన్నను మించిపోయాడని చెప్పొచ్చు. కాకపోతే ఇన్ని పధకాలు అమలుచేయటానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయనేది ? ఆంధ్ర రాష్ట్రం పూర్తి లోటు లో నడుస్తుందని ఒకవైపు చెబుతూనే రెండోవైపు ఏ రాష్ట్రమూ అమలుచేయనన్ని సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముందుగా ఆర్ధిక పరిస్థితి ని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతయినా వుంది. అయితే ఒక్కటిమాత్రం నిజం. సామాన్య ప్రజానీకం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏంటి ఎలా నడుపుతున్నారు అనే చర్చలోకి వెళ్లే అవకాశం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయనే దానిపైనే వాళ్ళు ప్రభావితమవుతారు. ఆ కోణంలో చూస్తే జగన్ ప్రజల మనసుల్ని దోచుకుంటున్నాడని చెప్పొచ్చు.
నిన్న కాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏ ఒక్కరూ అభినందించకుండా ఉండలేరు. మహిళలపై అత్యాచారం కేసులు 21 రోజుల్లో పూర్తి కావాలని , శిక్షలో భాగంగా వురి శిక్షను చేర్చటం , ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పటం నిజంగా అభినందనీయం. ఈ చట్టం ఓ విధంగా దేశం మొత్తానికి మోడల్ చట్టంగా నిలిచే అవకాశముంది. దీని అమలు కూడా ఇంతే చిత్తశుద్ధి తో చేస్తారని ఆశిద్దాం. అలాగే అస్సైన్డ్ భూముల విషయం లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతంగా వుంది. ఇంతవరకు ఈ ఆరునెలల్లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే జగన్ పరిపాలన వాళ్ళ నాన్నను మరిపించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మద్యపాన నియంత్రణ, గ్రామ సచివాలయవ్యవస్థ , ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాల కల్పన, ఇంగ్లీష్ మీడియం లో బోధన అత్యంత ముఖ్యమైనవి. ఇక సంక్షేమ పధకాల గురించి సరే సరి. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి, గృహ లబ్దిదారులకు లబ్ది చేకూర్చటం కూడా మన్ననలు పొందాయి. కాకపోతే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ విద్యుత్తు పునరుత్పాదక ప్రాజెక్టులకు వర్తించకుండా ఉంటే మంచిది. లేకపోతే కేంద్రంతో పెద్ద వివాదం లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అందునా మొత్తం విదేశీ పెట్టుబడుల పై ప్రభావం పడుతుంది.
ఇక చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా వుంది. యు టర్న్ బాబుగా అందరి చేత పిలిపించుకుంటున్న సంగతి తెలిసిందే. మళ్ళా ఈ రోజు అసెంబ్లీ లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై యు టర్న్ తీసుకోవటం చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితి పై ఆందోళనగా వుంది. ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియదు. నిన్నటిదాకా జగన్ తీసుకున్న నిర్ణయంపై నిప్పులు చెరిగి ఈ రోజు నేను ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు అని చెప్పటం తనకే చెల్లింది. తనని చూస్తే జాలేస్తుంది. గౌరవంగా తప్పుకొని వేరే వాళ్లకు ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెడితే హుందా గా ఉంటుంది. ఎందుకంటే పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేంకదా . లేదంటే ఇంకేదైనా వ్యాపకం చేసుకుంటే మంచిదేమో ఆలోచించాలి. ఏ కోణం లో చూసినా తనకు, తన పార్టీ కి సమీప భవిష్యత్తు లో భవిష్యత్తు లేదనిపిస్తుంది. ఇప్పటికే తన ముఖ్య అనుయాయులని బీజేపీ లోకి పంపించిన విషయం ప్రజలందరికీ తెలుసు. అటువంటప్పుడు సామాన్య కార్యకర్తల్లో మాత్రం ఎందుకు విశ్వాసముంటుంది. ఏదో అచ్చన్నాయుడు లాంటి భారీ పర్సనాలిటీలు మద్దత్తు తో పార్టీని నడపటం అంట తేలిక కాదు.
ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ ఆరు నెలలల్లోనే జగన్ పైపైకి చంద్రబాబు కింది కింది కి వడివడిగా అడుగులు పడ్డాయి. ఇదే కొనసాగితే వచ్చే ఆరు నెలల్లో పరిస్థితుల్లో ఇంకెన్ని మార్పులొస్తాయో.