
మేము స్వాగతిస్తున్నాం.. : సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి
అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సుప్రీం తీర్పుని అంగీకరిస్తున్నామని ఫరూకి తెలిపారు. సుప్రీం తీర్పుపై సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఎలాంటి రివ్యూకి వెళ్లదని,ఎటువంటి క్యూరేటివ్(నివారణ)పిటిషన్ వెయ్యమని తాను సృష్టం చేస్తున్నానని ఫరూకి తెలిపారు.
అయోధ్య తీర్పుపై షియా న్యాయవాది మౌలానా కల్బే జావద్ మాట్లాడుతూ…సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. పెద్ద సంఖ్యలో ముస్లింలు సుప్రీం తీర్పుని అంగీకరించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను. వివాదం ఇప్పుడు ముగిసిపోయింది. ముస్లిం పర్శనల్ లా బోర్డు రివ్యూ పిటీషన్ ఫైల్ చేయాలని అనుకోవడంయ వాళ్ల హక్కు. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోవాలని తాను అనుకుంటున్నానని మౌలానా తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : అజ్మీర్ దర్గా అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, దాని నిర్ణయాన్ని ప్రతివారూ గౌరవించాలని అన్నారు. భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. సుప్రీంతీర్పు న్యాయ వ్యవస్థ సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేసిందని అన్నారు.
మేం పూర్తి సంతృప్తితో ఉన్నాం- హషీం అన్సారీ కుమారుడు
రామ జన్మభూమి, బాబ్రీ వివాదాలకు సంబంధించిన పిటిషనర్ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పుపై పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు తెలిపారు.
‘‘మేం 200 శాతం సంతృప్తి చెందాం. కోర్టు తన నిర్ణయాన్ని సరిచేసుకుంది. ఇంతకుముందు కోర్టును గౌరవించాం, ఈ రోజు కూడా మేం అదే చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లయితే అది మంచి విషయం అవుతుంది. ప్రభుత్వం చేసే పనిని మేం అంగీకరిస్తాం. హిందూ, ముస్లిం సోదరులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటన్నా, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది, దీన్ని మనం అంగీకరించాలి’’ అని పేర్కొన్నారు.
ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ
అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేమని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్‌ను తిరస్కరించాలని అన్నారు. ‘ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. లీగల్ హక్కుల కోసమే తాము పోరాడామన్నారు. ఏఐఎంపీఎల్‌బీ వాదనతో తాము ఏకీభవస్తున్నామని చెప్పారు. ‘వాస్తవాల మీద విశ్వాసాలే గెలిచాయి’ అని తీర్పుపై స్పందించారు. తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి
సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.