పేర్లు: రాజకీయ ప్రహసనం

రాజకీయనాయకులు ఏం చేసినా అతిగానే ఉంటుంది. ప్రజల్లో నాయకులమీద వున్న సానుభూతిని ఎలా సొమ్ము చేసుకోవాలో వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకు ఓ ఉదాహరణ పథకాలకు నాయకుల పేర్లు. దేశంలో ఏమూలకెళ్లినా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లే కనపడతా ఉంటాయి. పార్టీలకు అతీతంగా వాళ్ళను ప్రజలూ చూడటంలేదు, పార్టీలు అంతకన్నా. చివరకు ఈ పేర్ల ప్రహసనం ఓ పెద్ద జోకు అయిపొయింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కేవలం మహాత్మాగాంధీ పేరుతోనే […]

Written By: admin, Updated On : February 8, 2020 10:10 am
Follow us on

రాజకీయనాయకులు ఏం చేసినా అతిగానే ఉంటుంది. ప్రజల్లో నాయకులమీద వున్న సానుభూతిని ఎలా సొమ్ము చేసుకోవాలో వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకు ఓ ఉదాహరణ పథకాలకు నాయకుల పేర్లు. దేశంలో ఏమూలకెళ్లినా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లే కనపడతా ఉంటాయి. పార్టీలకు అతీతంగా వాళ్ళను ప్రజలూ చూడటంలేదు, పార్టీలు అంతకన్నా. చివరకు ఈ పేర్ల ప్రహసనం ఓ పెద్ద జోకు అయిపొయింది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కేవలం మహాత్మాగాంధీ పేరుతోనే పధకాలు గానీ, రోడ్లుగానీ, అన్నింటికన్నా ముఖ్యంగా విగ్రహాలుగానీ వెలిసేవి. అప్పట్లో పుట్టిన పిల్లలకు కూడా జాతీయనాయకుల పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలే స్వచ్చందంగా విగ్రహాలు పెట్టే సంస్కృతి కూడా ఉండేది. నేతాజీ సుభాష్ చంద్ర బోసు విగ్రహాలు ఆంధ్రాలో ఏ మూలకెళ్లినా దర్శనమిచ్చేవి. ఇవి ప్రజలు స్వచ్చందంగా నిర్మించినవి. ఆ తర్వాత సంస్కృతి మారింది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విగ్రహాలు ప్రతి గ్రామానా పెట్టారు. అయితే ఆయన గాంధీ తర్వాత అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు కాబట్టి అందుకు ప్రజలు పూర్తిగా కలిసివచ్చారు. ఆ తర్వాత దశలో అంబేద్కర్ విగ్రహాలు విరివిగా వచ్చాయి. అవి ప్రతిష్టించటం లో దళిత సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత కాంగ్రెస్ కూడా ప్రోత్సహించటం మొదలు పెట్టింది. వాస్తవానికి అంబేద్కర్ భారత దేశం లోని అతి కొద్దిమంది మేధావుల్లో ఒకరు. ఆయన బ్రతికున్నంతకాలం రావాల్సినంత పేరు, ప్రఖ్యాతులు రాలేదు. ఆయన్ను పార్లమెంటుకు రానివ్వకుండా ఓడించారు. ఆ తర్వాత అవసర రీత్యా తప్పనిపరిస్థితుల్లో తనకు ప్రాచుర్యం కల్పించారు. అలాగే భారత దేశ ఇంకో దార్శనికుడు డాక్టర్ రామమనోహర్ లోహియా కు రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదు. చరిత్రలోకి తొంగిచూస్తే దీనిపై ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు.

ఈ పేర్ల ప్రాముఖ్యం వింతపుంతలు తొక్కటం మొదలుపెట్టింది ఇందిరా గాంధీ తదనంతరం. ముందుగా ఇందిరా గాంధీ , తర్వాత రాజీవగాంధీ పేర్లు ప్రతి పధకానికి పెట్టటం మొదలయ్యింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే ప్రజలకు మొహం మొత్తిందాకా. అయినా ప్రజలు ఏం చేస్తారు భరించటంతప్ప. ఈ ప్రహసనం కాంగ్రెస్ అప్రతిహంగా కొనసాగినంతకాలం బాగానే వుంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావటం మొదలుపెట్టింతర్వాత దీనిని సమీక్షించటం మొదలుపెట్టారు. అయితే వాళ్లలో ఆ స్టేచర్ వున్న నాయకులు లేరు కాబట్టి పేర్ల ప్రహసనం ఆగిపోయింది. మోడీ వచ్చినతర్వాత ప్రతి పధకానికి ఓ కొత్త నామాన్ని పెట్టటం మొదలుపెట్టాడు. పధకం ముందుగా ప్రధానమంత్రి పేరు తగిలిస్తున్నాడు. ఓ విధంగా ఇది రేపు అధికారం లోకి ఎవరొచ్చినా ఇబ్బంది ఉండదు.

ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఈ పేర్ల ప్రహసనం చంద్రబాబు నాయుడు తోనే మొదలయిందని చెప్పొచ్చు.ఎన్టీఆర్ పేరుని అన్నింటికీ తగిలించటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ ప్రతిగా ప్రతిపథకానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టటం
మొదలుపెట్టాడు. ఈ తంతు అధికారమార్పిడి జరిగినప్పుడల్లా నడిచింది. చివరగా చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వం లో ఎన్ టిఆర్ పేరు తో పాటు తనపేరుతో పధకాలు ప్రారంభించటం మొదలుపెట్టాడు. చంద్రన్న పధకాలు ప్రారంభించాడు. ఇది కొత్త ఒరవడి. దాన్నే జగన్ ఇప్పుడు కాపీ కొట్టాడు. తన తండ్రి వైఎస్సార్ తో పాటు తనపేరుతో కూడా పధకాలు ప్రారంభించాడు. ఇప్పుడు చంద్రన్న బదులు జగనన్న పధకాలు మొదలయ్యాయి. వీళ్లిద్దరూ బతికుండగానే వాళ్ళ పేర్లను ప్రాచుర్యం లోకి తెచ్చుకోవాలని తాపత్రయపడటం కొంత జుగుప్సాకరంగా వుంది. ముందు ముందు చంద్రబాబు, జగన్ విగ్రహాలను కూడా వాళ్లే ప్రారంభించుకుంటారేమో చూడాలి. రాజకీయాల దిగజారుడుతనానికి ఇంతకన్నా ఏం కావాలి?