Private Medical Colleges Telangana: ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్దాం. అప్పట్లో ఇంజనీరింగ్ అంటే యమా క్రేజీ. కోర్సు పూర్తి చేస్తే జాబ్ వచ్చేసినట్టే. కానీ ఆ ఇంజనీరింగ్ అనేది కొంతమందికి మాత్రమే పరిమితమయ్యేది. తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తెరపైకి తీసుకురావడంతో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మొదట్లో ప్రభుత్వం సక్రమంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది. తర్వాత భారంగా మారడంతో అనేక షరతులు పెట్టింది. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే ఏర్పాటయిన కాలేజీలు ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మూతపడ్డాయి. కొన్ని కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు స్టడీ, సాప్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక రోడ్డున పడ్డారు. ఇప్పుడు వర్తమానం లోకి వస్తే తెలంగాణలో రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితి ఉంది. పైగా ఉన్న ఆ కాస్త కాలేజీలకు కూడా ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఇప్పుడు వైద్య కాలేజీల వంతు
గత కొన్నేళ్లుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్వహణ భారం ఏటికేడు పెరిగిపోతోంది. వైద్య విద్య కోసం గతంలో మాదిరి విద్యార్థులు ఆ కాలేజీ ల వైపు చూసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. గతేడాది ప్రభుత్వం 8 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసింది. ఈ సంవత్సరం మరో 9 వైద్య కళాశాలలు కావాలని ఆగస్టు 9 , 10 తేదీల్లో దరఖాస్తు చేసింది. ఇప్పటికే జగిత్యాల, నాగర్ కర్నూల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. మిగిలిన వాటికి కూడా ఈ నెలాఖరు వరకు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు అవుతాయి. ప్రస్తుతం ప్రైవేటులో 23 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మరో మూడు, నాలుగు కాలేజీల కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఫలితంగా వచ్చే సంవత్సరం నాటికి ప్రభుత్వం, ప్రైవేటులో కలిపి 50 కి పైగానే వైద్య కళాశాలలు ఉంటాయి. దరఖాస్తులకు గనుక వెంటనే అనుమతులు వస్తే రెండేళ్లలో ప్రభుత్వ కాలేజీల్లో 2,100 సీట్లు, మొత్తంగా 3,915 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేట్ లోను కలిపితే మొత్తం 7000 పైగా ఎంబిబిఎస్ సీట్లు అవుతాయి. ప్రభుత్వ కాలేజీలో సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో, పేరున్న ప్రైవేటు కాలేజీలను పక్కనపెడితే కొత్త కాలేజీలపై నిర్వహణ భారం పెరుగుతుందని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్వహణ భారం మోయలేక ఇప్పటికే మూడు నాలుగు కాలేజీలు అమ్మాలని వాటి యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇవి పదేళ్ల క్రితం లోపే ఏర్పాటయ్యాయి.
Also Read: China- India: భారత్ చుట్టు ఉచ్చు బిగిస్తున్న చైనా.. పాక్, అప్ఘన్ లో తిష్ట
కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి
ప్రభుత్వ వైద్య కళాశాలలో పెరుగుతుండడంతో ప్రైవేట్ కాలేజీలకు కొత్త సమస్యలు వస్తున్నాయి. కాలేజీలు పెరగడంతో ఒక్కసారిగా అధ్యాపకులకు డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ లో ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ప్రభుత్వ కళాశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రైవేట్ కాలేజీల్లో ప్రొఫెసర్లు తగ్గిపోతున్నారు. ఇది అక్కడ వైద్య విద్య బోధనపై ప్రభావం చూపుతోంది. అధ్యాపకులు దొరకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లను తీసుకొని రావాల్సి వస్తుందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. అలాగే సర్కార్లో పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రైవేట్ లోని సీ కేటగిరి సీట్లకు డిమాండ్ భారీగా తగ్గుతుందని వైద్య విద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రైవేట్ లో సీ కేటగిరి సీటుకు సర్కారీ జీవో ప్రకారం ప్రతి ఏటా ₹23 లక్షలు చెల్లించాలి. ఇలా ఐదేళ్లకు కోటికి పైగానే అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీల్లో వెయ్యి వరకు సీ కేటగిరి సీట్లు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 200 వరకు భర్తీ కావడం లేదని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ సీట్లు ఖాళీగా ఉంటే యాజమాన్యాలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. అందుకే కొన్ని కాలేజీలు బీ కేటగిరి ఫీజు(11.25 లక్షలు) చెల్లిస్తే చాలు సీ కేటగిరి సీట్లను ఇచ్చేస్తున్నాయి. మున్ముందు ఆ డిమాండ్ ఇంకా తగ్గుతుందని వైద్య విద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆర్థికంగా నిలదొక్కుకునే స్థితికి రావడం కూడా కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఒకే మెడికల్ కాలేజీ బ్రేక్ ఈవెన్ కి రావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో కాలేజీలకు అటువంటి పరిస్థితి లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు మాత్రం ఆర్థికంగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే పీజీ సీట్లు వచ్చిన ప్రైవేటు కాలేజీలకు కూడా ఆర్థికంగా సమస్యలు ఉండవని, పిజి సీట్లు రాని వాటికి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంటున్నాయి. మరో వైపు ఏటా తెలంగాణ రాష్ట్రం నుంచి 400 మంది వైద్య విద్యార్థులు విదేశాలకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్తున్నారు. ఇప్పుడు కాలేజీలు కూడా పెరుగుతుండటంతో ఉక్రెయిన్, రష్యా తో పాటు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కాళోజి యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
నాన్ క్లినికల్ కేటగిరీలో పెరిగిన డిమాండ్
ప్రస్తుతం కొత్త కాలేజీలు ఏర్పాటు అవుతుండడంతో ప్రొఫెసర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ అధ్యాపకులు చాలా తక్కువగా ఉన్నారు. వైద్య విద్య బోధనలో వీరు చాలా కీలకం. ప్రస్తుతం ఎంబిబిఎస్ తర్వాత అందరు కూడా క్లినికల్ పీజీల వైపు మొగ్గు చూపుతున్నారు. నాన్ క్లినికల్ సబ్జెక్టు ( రోగులతో ఏమాత్రం సంబంధం లేనివి) లు చేసేవారే లేకుండా పోయారు. దీంతో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అధ్యాపకులకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం సర్కారీ కాలేజీల్లో అధ్యాపకులకు రెగ్యులర్ వేతనానికి అదనంగా, ప్రతీ నెలా మరో రూ. 50 వేలను చెల్లిస్తున్నారు. అంటే ఈ కోర్సులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కోర్సులకు డిమాండ్ ఉంటుంది.
ఐదేళ్ళ ఏడు వేల మంది వైద్యులు
ఐదేళ్ళ తర్వాత ఏటా ఏడు వేల మంది ఎంబీబీఎస్ వైద్యులు బయటకు వస్తారు. మరో ఐదేళ్లల్లో 35 వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. ఇక ఎంబీబీఎస్ చేసిన వారు పీజీ చేయడం అసాధ్యం. ఎందుకంటే యూజీ తో పోల్చితే పీజీ సీట్ల సంఖ్య తక్కువ. ఉన్న వారు కూడా క్లినికల్ వైపే మొగ్గుతున్నారు. ఫలితంగా ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య పెరిగిపోతున్నది. ఇప్పటికే భారతదేశంలో ప్రతి 840 మందికి ఒక ఎంబిబిఎస్ వైద్యుడు ఉన్నారు. మన రాష్ట్రంలో ఐదేళ్ళ తర్వాత ప్రతి 500 మందికి ఒక ఎంబిబిఎస్ డాక్టర్ ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇదే విధానం కొనసాగితే ఎంబిబిఎస్ విద్య కూడా ఈ ఇంజనీరింగ్ తరహాలో మారుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఒక తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 175 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది. ప్రైవేట్ లో కూడా సీట్లు పెరుగుతున్నాయి. వెరసి యుజి సీట్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఎంతో క్రేజీ ఉన్న వైద్య విద్య పై యువతకు ఉన్న మోజు తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read:NTR Arogya Ratham: చంద్రబాబుకు బామ్మర్ది బాలయ్య హ్యాండ్ ఇస్తాడా ఏంటి? ఎన్టీఆర్ పేరుతో ముందుకు
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Private medical colleges for sale in telangana is medical education also becoming like engineering
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com