Pawan Kalyan YCP : ఏపీలో కాపులు జనసేనకు దగ్గర అవుతున్నారా? అదే సమయంలో వైసీపీకి దూరంగా జరుగుతున్నారా? ఇప్పుడిదే హాట్ టాపిక్. పవన్ దూకుడుతో కాపులు జనసేన వైపు వెళతారని భావించిన జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. చాలామంది నాయకులు పవన్ తో టచ్ లో ఉన్నారని జగన్ కు నిఘా వర్గాలు ఉప్పందించాయి. దీంతో సీఎం జగన్ బీసీ పల్లకి మోయడం ప్రారంభించారు. అందులో భాగంగానే బీసీ సంఘ నేత ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహిస్తున్నారు. తాజాగా పవన్ కాపు మంత్రులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే దారితీశాయి. దీనిపై కౌంటర్ అటాక్ ఇవ్వడంతో పాటు కాపులకు వైసీపీ ప్రభుత్వం మంచి చేసిందనే సందేశం ఇచ్చేందుకు కాపు ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో సమావేశం ఏర్పాటుచేశారు. అయితే సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ముఖం చాటేశారు. ఇందులో ఒక తాజా మాజీ మంత్రి ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పది మంది వరకూ కాపులు ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో వీరంతా పునరాలోచనలో పడ్డారు. గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రగడ ఉద్యమించారు. కాపు ప్రజల నుంచి కూడా ఉద్యమానికి విశేషస్పందన లభించింది. అదే సమయంలో జగన్ కాపులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లపై చిత్తశుద్ధిగా వ్యవహరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ను కాదని కాపు ప్రజలు జగన్ కే జై కొట్టారు. గుంపగుత్తిగా ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదంటూ పక్కకు తప్పుకున్నారు. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన 5 శాతం ఈబీసీ కోటానుసైతం రద్దుచేశారు. విదేశీ విద్యతో పాటు కాపు విద్యార్థుల రాయితీలను, సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ ప్రభుత్వంపై కాపుల్లో వ్యతిరేక భావనను నింపాయి.
అటు జనసేన అధ్యక్షుడు పవన్ వ్యక్తిగత జీవితంపై పదేపదే మాట్లాడడం కూడా కాపులకు రుచించడం లేదు. గత ఎన్నికల్లో తప్పుచేశామన్న భావన కాపుల్లో వ్యక్తమవుతోంది. పవన్ పై సానుభూతితో పాటు నమ్మకం పెరిగింది. అయితే రాజకీయాల్లో ఆరితేరిన జగన్ విషయాన్ని గమనించారు. పవన్ పై తన కేబినెట్ లోని కాపు మంత్రులనే ప్రయోగించడం ప్రారంభించారు. పవన్ రాజకీయ ఆరోపణలు చేసినా, ప్రజా సమస్యలను విన్నవించినా అదే పనిగా కొందరు కాపు మంత్రులు వ్యక్తిగతంగా దూషించడం కాపు ప్రజలకు ప్రభుత్వంతో పాటు సొంత సామాజికవర్గం నేతలపై కూడా ఏహ్యభావం కలిగింది. దీంతో వారు బాహటంగా జగన్ సర్కారు చర్యలను వ్యతిరేకించడం ప్రారంభించారు. జనసేనను తమ పార్టీగా ఓన్ చేసుకున్నారు. ఎక్కడికక్కడే ప్రజా వ్యతిరేకత వస్తుండడంతో పునరాలోచనలో పడిన వైసీపీ కాపు ఎమ్మెల్యేలు జనసేన వైపు చూడడం ప్రారంభించారు. కొందరు టచ్ లోకి వెళ్లారు. ఎన్నికల ముందు అన్ని పార్టీల కంటే వైసీపీ నుంచే ఎక్కువగా ఉంటాయన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి.
రాజమండ్రిలో సమావేశమైన కాపు ప్రజాప్రతినిధులు మరోసారి విజయవాడలో మీట్ అవుదామని నిర్ణయించుకున్నారు. అయితే రాజమండ్రి సమావేశానికి తాజా మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ,, బడ్డుకొండ అప్పలనాయుడుతో పాటు మరొకరు ముఖం చాటేశారు. దీంతో మిగతా కాపు ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ ప్రారంభమైంది. వారు ఏదైనా కారణంతో రాలేదా? లేక ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? అని ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు విజయవాడ సమావేశం నాటికి మరికొందరు గైర్హాజరయ్యే అవకాశముందని అధికార పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.