YCP Blames Balakrishna For Bheemla Nayak: ‘పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ సర్కార్’ గేమ్ లో పాపం ‘బాలయ్య’ బాబు బలైపోయాడు. ‘భీమ్లానాయక్’ను ఏపీ ప్రభుత్వం తొక్కేసిందన్న అపవాదును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మంత్రి పేర్ని నాని అసలు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే ‘బాలయ్య’బాబును కూడా ఇన్ వాల్వ్ చేసేశారు. బాలయ్య తన అఖండ సినిమా విడుదల సమయంలో జగన్ ను కలవడానికి ప్రయత్నించాడని.. టికెట్ల రేట్లపై కలుస్తానన్నాడని.. కానీ జగన్.. బాలయ్యకు ఇబ్బందులు పెట్టవద్దని సూచించాడని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్ ను కలిసి వెళ్లాక ఈ వివాదం మొదలైంది. అంతమంది కలిసినా జగన్ మాత్రం ఇప్పటికీ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా జీవోలు, నిర్ణయాలు తీసుకోలేదు.అయితే ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే కం సినీ అగ్రహీరో బాలయ్య వెళ్లకపోవడంపై రకరకాల చర్చలు జరిగాయి. సినిమా టికెట్ల విషయంలో సీఎం జగన్ ను కలిసేది లేదని.. ధరలు తక్కువగా ఉన్నప్పుడే అఖండ సూపర్ హిట్ అయ్యిందంటూ బాలకృష్ణ అన్నట్లు ప్రచారం సాగింది. బాలయ్య ఇలా అంటే.. పేర్ని నాని మాత్రం ఆయన గాలితీసేలా మాట్లాడి దుమారం రేపారు.
సినిమా టికెట్ల కోసం సీఎం వద్దకు వెళ్లనని.. హిందూపురం జిల్లాకోసం అయితే కలుస్తానని బాలయ్య గతంలో అన్నారు. దీంతో పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. అఖండ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా నిర్మాతలు తనకు ఫోన్ చేసి జగన్ అపాయింట్ మెంట్ అడిగారని.. ఆ తర్వాత బాలయ్య కూడా తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు పేర్ని నాని వివరించారు. సీఎం జగన్ ను కలవాలనుకుంటున్నామని.. అపాయింట్ మెంట్ ఇప్పించాలని బాలకృష్ణ కోరినట్లు పేర్ని నాని స్పష్టంగా తెలిపారు.
ఇదే విషయాన్ని తాను సీఎం జగన్ కు తెలుపగా.. ‘బాలయ్య వస్తే ఆయనకే ఇబ్బంది వస్తుందని.. మీరే ఏం కావాలో చేయాలని జగన్ సూచించినట్టు’ పేర్ని నాని బాంబు పేల్చారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. దీంతో అసలు బాలయ్య చెప్పింది నిజమా? లేక పేర్ని నాని చెప్పింది నిజమా? అన్నది సందిగ్ధంలో పడింది.
Also Read: ఇండస్ట్రీలో జగన్ ను ఎదురించి నిలిచిన ఏకైక మొనగాడు పవన్ కళ్యాణ్ యేనా?
భీమ్లానాయక్ వివాదాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు-బాలయ్య ల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ తిప్పిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాపం బాలయ్య ఏదో తనతో సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోవద్దనే ఉద్దేశంతో జగన్ ను కలువాలనుకుంటే.. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం న్యాయమా? అని పేర్నినానిని, వైసీపీ సర్కార్ ను పలువురు నిలదీస్తున్నారు.
బాలయ్య సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ అయినా కూడా బయట మాత్రం చిన్నపిల్లల మనస్తత్వమే. కోపాన్ని, ప్రేమను దాచుకోరు. అంతటి చపలచిత్వం గల నటుడు ఎమ్మెల్యేను కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దాడికి వైసీపీ వాడుకోవడం విశేషం. చంద్రబాబు, బాలయ్యల మధ్య వైరాన్ని సృష్టించడానికి తెరవెనుక జరిగిన విషయాన్ని కూడా పేర్ని నాని చెప్పడం సమంజసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘భీమ్లానాయక్’ వివాదాన్ని బాలయ్య-చంద్రబాబులను ఇరికించడానికి వైసీపీ సర్కార్ అందుబాటులో ఉన్న ప్రతీ లూప్ హోల్ ను వాడుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డ్.. సంతోషంలో థమన్ డ్యాన్స్ !
Recommended Video: