YCP Politics : వైసీపీ హై కమాండ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తోంది. మరికొందరు ఎమ్మెల్యేలకు అయితే పక్కన పడేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చింది. ఇలా మార్పులు జాబితా 80 వరకు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎంపీలను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అసెంబ్లీ స్థానాలకు పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే 11 మంది అభ్యర్థుల మార్పుతో జగన్ సంచలనం సృష్టించారు. ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్, కొండేపి కి ఆదిమూలపు సురేష్, వేమూరుకు వరికూటి అశోక్ బాబు, తాడికొండకు మేకతోటి సుచరిత, సంతనూతలపాడుకు మెరుగు నాగార్జున, చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడదల రజిని, అద్దంకికి పాణం హనిమిరెడ్డి, మంగళగిరి కి గంజి చిరంజీవి, రేపల్లెకు ఈపూరు గణేష్, గాజువాకకు వరికుట్టి రామచంద్రరావు లను నియమించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రెండో జాబితా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇద్దరు ఎంపీలతో పాటు ఓ మంత్రి పేరు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని సమాచారం. సుభాష్ చంద్రబోస్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న చిల్లు పోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ కు మార్పు చేస్తారని తెలుస్తోంది. భరత్ రాజమండ్రి సిటీ నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరికీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి సిటీ నుంచి భవాని భర్త రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయితే జనసేనతో పొత్తు ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాలు టిడిపి ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా ఆ నియోజకవర్గాల్లో పట్టు కోసం ఆరాటపడుతోంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.