Minister Roja : న”బూతే” రాజకీయ భవిష్యత్తు .. రోజాను తిట్టిన వ్యక్తికే వైసిపి ఎంపీ టికెట్!?

బండారు సత్యనారాయణమూర్తికి వైసిపి టికెట్ ఆఫర్ చేసిందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ వైసీపీ టికెట్ ఇచ్చినప్పటికీ.. బండారు సత్యనారాయణమూర్తి దీర్ఘకాలం ఆ పార్టీలో ఉండే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 10:50 pm

YCP MP ticket for the person who insulted Minister Roja!?

Follow us on

Minister Roja : ఒకప్పుడు పనితీరు ఆధారంగానే రాజకీయ నాయకులకు టికెట్లు లభించేవి. రోజులు మారుతున్న కొద్దీ పనితీరు మరుగున పడిపోతున్నది. కేవలం పనికిమాలిన మాటలు మాట్లాడిన వారికే టికెట్లు దక్కే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ఓ అభ్యర్థి విషయంలో చూపిస్తున్న చొరవే పై ఆరోపణలకు కారణం. ఇక ఇదంతా చూసిన తర్వాత బూతే నేతల భవిష్యత్తని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు గతంలో రాతలు రాసిన పత్రిక, విజువల్స్ చూపించిన ఛానల్, నిరసన ప్రదర్శన చేసిన వైసీపీ నాయకులు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారనేది తాజా ప్రశ్న.

ఇటీవల వైసిపి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క అనకాపల్లి స్థానానికి మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించడంతో అక్కడి సిట్టింగ్ ఎంపీ కి హ్యాండ్ ఇచ్చినట్టు స్పష్టమైనది. అయితే ఆ బీసీ నేత ఎవరని ఆరా తీస్తే.. అతడు టిడిపి నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి అని వైసిపి నాయకుల ద్వారా తెలుస్తోంది. పెందుర్తి సీటు జనసేనకు వెళ్లిపోవడంతో బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడు కోపంతో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక తీరుగా బల ప్రదర్శన చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే రేపో, మాపో పార్టీ మారుతామని హెచ్చరికలు పంపుతున్నారు. వాస్తవానికి పెందుర్తి టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి వచ్చేదే. కాకపోతే ఆ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోయింది. తన స్థానాన్ని కాపాడకుండా చంద్రబాబు నాయుడు జనసేనకు ఇచ్చారనేది బండారు సత్యనారాయణమూర్తి చేస్తున్న ప్రధాన ఆరోపణ. పైగా బండారు గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నేతలపై పోరాడుతున్నారు. అచ్చంగా వారిలాగే ప్రతి విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో ఆయన మంత్రి రోజాపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

అయినప్పటికీ బండారు సత్యనారాయణమూర్తికి వైసిపి టికెట్ ఆఫర్ చేసిందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ వైసీపీ టికెట్ ఇచ్చినప్పటికీ.. బండారు సత్యనారాయణమూర్తి దీర్ఘకాలం ఆ పార్టీలో ఉండే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా ఎంపీ రామ్మోహన్ నాయుడు బండారు సత్యనారాయణమూర్తికి అల్లుడు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కొందరేమో బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ దాదాపు ఓకే అయ్యిందని.. చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఇటు సత్యనారాయణమూర్తి రేపు లేదా మాపు పార్టీ మారతామని సంకేతాలు ఇస్తున్నారు. వీటన్నింటిపై ఒక స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడక తప్పేలా లేదు.