Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ‘కర్ణాటక’ రాజకీయం.. వర్కవుట్ అవుతుందా?

ఎలా చేసినా బీఆర్‌ఎస్‌కే నష్టం. మరి గులాబీ నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Written By: NARESH, Updated On : October 29, 2023 4:07 pm
Follow us on

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు త్రిముఖ పోరులా కనిపించిన పరిస్థితులు క్రమంగా అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రచారం హీటెక్కుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలు కర్ణాటక సెంట్రిక్‌ గానే రాజకీయం చేస్తున్నాయి. కర్ణాటక ప్రజలు, రైతులను కాంగ్రెస్‌ మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే.. అదే కర్ణాటకను మోడల్‌గా చూపి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

కర్ణాటక రైతులతో తెలంగాణలో ఆందోళన..
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ప్లాన్‌ వేశారు. సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లోని గద్వాల, కొడంగల్‌ తదితర నియోజకవర్గాలకు కర్ణాటక రైతులను రప్పించి.. వారితో తమను కాంగ్రెస్‌ మోసం చేసిందనేలా ఆందోళనలు, కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ముట్టడి చేయిస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని రైతులతో మాట్లాడించి సొంత మీడియాలో కథనాలు వండి వారుస్తోంది. నాలుగైదు రోజులుగా ఈ కన్నడ రాజకీయాన్ని బీఆర్‌ఎస్‌ కొనసాగిస్తోంది.

ఆందోళనల వెనుక అనేక సందేహాలు..
కర్ణాటక రైతులకు కరెంటు కాకపోయినా, అక్కడి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా అక్కడి ప్రజలు తమ రాష్ట్రంలోనే ఆందోళనలు చేస్తారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా చూస్తూ ఊరుకోదు. కానీ, ఇవేమీ జరగడం లేదు. టెక్నాలజీ ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చింది. సొంత మీడియా చానెల్‌ కూడా ఉంది. అక్కడికి రిపోర్టర్లను పంపించి పరిస్థితులపై కథనాలు ఇవ్వొచ్చు. కానీ బీఆర్‌ఎస్‌ అలా చేయడం లేదు. కొంతమంది రైతులను కావాలనే ఇక్కడికి రప్పించి ఆందోళనలు చేయిస్తోందని అర్థమవుతోంది. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా చేసేందుకే అధికార బీఆర్‌ఎస్‌ ఇలా చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్‌ రివర్స్‌ ఎటాక్‌..
బీఆర్‌ఎస్‌ చేస్తున్న కర్ణాటక రాజకీయానికి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌ రంగంలోకి దిగింది. కర్ణాటక రైతులకు పనేం లేనట్లుగా తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు చేస్తున్న రాజకీయాన్ని తిప్పి కొట్టేందుకు ఏకంగా కర్ణాటక డిప్యూటీ సీఎంనే రంగంలోకి దించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో విడత బస్సు యాత్రలో డీకే శివకుమార్‌ శనివారం వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు నేరుగా సవాల్‌ చేశారు. తాము ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలు అమలు చేస్తున్నామో లేదో తెలియాలంటే కర్ణాటక రావాలన్నారు. డేట్, టైం డిసైడ్‌ చేస్తే తానే బస్సులో తీసుకెళ్తానని ప్రకటించారు. అంతకు ముందు కేటీఆర్‌ కూడా కర్ణాటకను పరిశీద్దామని సవాల్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ కోర్టులోనే బంతి..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రే స్వయంగా కర్ణాటకకు తీసుకెళ్తానని చాలెంజ్‌ చేయడంతో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడింది. ప్రస్తుతం సవాల్‌ బంతి బీఆర్‌ఎస్‌ కోర్టులోనే ఉంది. మరి డీకే శివకుమార్‌ సవాల్‌ను బీఆర్‌ఎస్‌ స్వీకరిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సవాల్‌ స్వీకరించకుంటే.. తెలంగాణ రైతుల ఆందోళన అంతా స్క్రిప్టెడ్‌ అని అర్థమవుతుంది. సవాల్‌ స్వీకరిస్తే కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలు నిజమే అని తెలిసిపోతుంది. ఎలా చేసినా బీఆర్‌ఎస్‌కే నష్టం. మరి గులాబీ నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.