Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో ఊహించిందే జరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పలు విడతల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో పాదయాత్ర చేసి పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ పదవి సరిగ్గా ఎన్నికల సమయానికి ఎందుకు పోయింది? ఇది బండి సంజయ్ చేసుకున్న స్వయంకృతపరాధమా? లేక పార్టీ పెద్దలు ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసిందా? అన్న చర్చ జరుగుతోంది.
బలాలు – విజయాలు
ఎన్ని విమర్శలున్నా, ఎన్ని వివాదాలొచ్చినా.. బండి సంజయ్ అధ్యాయం తెలంగాణ బీజేపీలో ఎప్పటికి మరిచిపోలేనిది. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఒక ఊపును తీసుకొచ్చిన నాయకుడు బండి సంజయే. అది పాదయాత్ర అయినా, లేక పాత బస్తీ అయినా.. అధికార పార్టీ బీఆర్‌ఎస్Sతో సై అంటే సై అన్నట్టుగా సాగింది బండి ప్రయాణం. సంజయ్‌కి ఆది నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మద్దతు ఉంది. ఈ కారణంగా.. బండిని పదవులు వరించాయి. ఒకానొక దశలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్.. కట్టెలమ్మిన చోటే.. పూలమ్మాలన్నట్టుగా లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా నిలిచారు.
పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో..
బక్కపలచని ఆహార్యం, పూర్తి మాస్ తరహాలో డైలాగ్‌లు కమలనాథుల్లో ఓ కొత్త జోష్ నింపేందుకు ఆరంభంలో బండి సంజయ్ బాగా ప్రయత్నించారు. ఒకానొక దశలో కేసీఆర్‌ను ఢీ కొట్టే నాయకుల్లో బండి సంజయ్ పేరు బలంగా నిలిచింది.
వివాదాలు – విమర్శలు
బండి సంజయ్పై ఉన్న ప్రధాన విమర్శ నోటి దురుసు. తొందరగా మాట జారేయడం, దాన్ని వెనక్కి తీసుకోలేక.. ఇబ్బంది పడడం. ఆయనపై ఉన్న మరో ఆరోపణ నాయకత్వ లోపం. క్యాడర్ను బాగా చూసుకుంటాడని మంచి పేరున్నా.. చుటూ‍్ట ఉండే నేతలను కలుపుకుని పోలేడని అంటారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పెద్ద తలకాయల్లో చాలా మందితో బండి సంజయ్ కు పొసగదనే అపవాదు ఉంది. కొందరయితే బండి సంజయ్ ఉన్నంత కాలం బీజేపీ ఆఫీసుకు రానని శపథం పట్టారని చెప్పుకుంటారు. తన సహచర ఎంపీ అయిన ధర్మపురి అరవింద్‌తో కూడా సంజయ్‌కు సత్సంబంధాలు లేవు.
బండి కారణంగానే చేరికలు లేవని..
బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ నుంచి చాలా మందిని బీజేపీలోకి తీసుకువస్తారని భావించారు. అధిష్టానం కూడా ఆ ఉద్దేశంతోనే పదవి అప్పగించింది. కానీ ఈటల బడా నేతలెవరినీ బీఆర్‌ఎస్‌లోకి తీసుకురాలేదు. తాజాగా పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపి వారు బీజేపీలో చేరరని ప్రకటించారు. బండి సంజయ్ ఉంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకురావడం కష్టమన్నది మరికొందరి ఆరోపణ. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఒక బలమైన నేతను పార్టీ కోసం నిలపలేకపోయారంటారు. ఇప్పటికీ చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు.
ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు..
మరోవైపు బండి సంజయ్ పార్టీ డబ్బులను ఇష్టానుసారం ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రచారం పేరుతో యాడ్స్ పేరుతో డబ్బులు వృథా చేశారనే పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ఇదే ఆరోపణ చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అవి తనకు ఇచ్చి ఉంటే రాష్ట్రాన్నే దున్నేవాడినని ప్రకటించారు.
ఢిల్లీ, కార్పొరేట్ రాజకీయాలను అవపోసన పట్టక..
మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలో క్లాస్‌ను మరిచిపోవడం వల్ల బండి సంజయ్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కలేదంటారు ఆ పార్టీ నాయకులు. మరోవైపు ఢిల్లీ, కార్పొరేట్ రాజకీయాలను బండి సంజయ్ అవపోసన పట్టలేదు. ఈ నేపథ్యంలోనే వెనుక ఏం జరుగుతుందో గ్రహించలేకపోయారు. ఇదిలా ఉంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే తన ట్విట్టర్ అకౌంట్‌లో హోదా మార్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి స్థానంలో బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు.
Please don’t change Bandi Sanjay Anna 🙏🏻😞
పార్టీ పెద్దలకు నా యొక్క విన్నపం దయచేసి బండి సంజయ్ అన్న గారిని అధ్యక్ష పదవి నుండి మర్చాకండి…#BandiSanjay pic.twitter.com/HE1njXfnaM
— Neeraj Goud Gollapelli (@NeerajGoudBJP) July 3, 2023