మన హిందూ సాంప్రదాయాలలో నిర్వహించే ప్రతి కార్యం వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. పండుగల రోజు కానీ,శుభకార్యాలలో గాని చేసే కార్యాలు ప్రతి ఒకటి ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది కొత్తగా ఇంటిని నిర్మించిన తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు, లేదా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ముందుగా ఇంట్లో పాలు పొంగిస్తారు. ఈ విధంగా నూతన ఇంటిలో పాలు పొంగి పెట్టడానికి గల కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు.కాకపోతే అది అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ఇప్పుడు పొంగిస్తుంటారు.అయితే గృహప్రవేశం చేసేటప్పుడు పాలపొంగు పెట్టడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
నూతన గృహ ప్రవేశం చేసే ఇంటిలో పాలుపొంగు పెట్టడం వల్ల ఆ ఇల్లు సకల సంపదలతో కళకళలాడుతుందని భావిస్తారు. సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. లక్ష్మీదేవి పతి శ్రీహరి అనే విషయం మనకు తెలిసిందే. సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు పాల సముద్రం పై పవళిస్తారు.అందువల్ల ఆ ఇంటిలో పాలు పొంగి పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉండి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని భావిస్తారు.
ముందుగా నూతన గృహప్రవేశం చేసేవారు ఇంట్లోకి గోవును తీసుకువెళ్తారు. మొదటగా ఇంట్లో గోవు ప్రవేశించడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భావిస్తారు. అదేవిధంగా ఆ ఇంటి ఆడపడుచుల ద్వారా ఇంటి యజమాని లోపలికి ప్రవేశించి వారిచేత కొత్త ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా ఆడపడుచుల చేత పాలు పొంగించడం ద్వారా ఆఇంట్లో వదిన, ఆడపడుచుల మధ్య సాన్నిహిత్యం బాగుంటుంది. ఈ విధంగా వారిచేత పొంగించిన పాలతో నైవేద్యం తయారుచేసి పూజా సమయంలో దేవుడికి సమర్పిస్తారు.