BRS in AP : ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఆశలు వదులుకున్నట్టేనా? ఇక్కడ కనీస చర్యలు లేకపోవడం దేనికి సంకేతం?ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కు ఏపీలో అంత సీన్ లేదన్న టాక్ ప్రారంభమైంది. కనీసం మరాఠా రాష్ట్రంపై ఉన్న శ్రద్ధ తెలుగు రాష్ట్రంపై చూపకపోవడం హాట్ టాపిక్ గా మారింది. చివరకు ఏపీ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ ముఖం చాటేశారు. కనీసం తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడే సాదాసీదాగా కార్యాలయాన్ని ప్రారంభించి మమ అనిపించేశారు. మొక్కుబడి తంతుగా ముగించారు.
బీఆర్ఎస్ ప్రకటన సమయంలో కేసీఆర్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తోట చంద్రశేఖరరావు, రావెల కిశోర్ బాబును చేర్చుకున్న క్రమంలో ఎన్నెన్నో మాటలు చెప్పారు. తెలంగాణ ప్రగతిభవన్ కు మించి ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం రద్దీగా మారుతుందని.. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం టచ్ లో ఉన్నట్టు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే పేరున్న నాయకుడు ఒకడంటే.. ఒకరు కూడా చేరలేదు. కేసీఆర్ మహారాష్ట్రలో ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. ప్రతిరోజూ కొంత మందిని హైదరాబాద్ కు తీసుకు వచ్చి మరీ గులాబీ కండువా కప్పతున్నారు. అంతకుముందే పలువురు ఏపీ నేతల్ని చేర్చుకుని అక్కడ కూడా పార్టీని విస్తరిస్తామని ప్రక టించారు. ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు. వైజాగ్ లో సభను నిర్వహిస్తామని చెప్పారు. కానీ కేసిఆర్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఏపి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
వాస్తవానికి ఏపీ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలన్నది కేసీఆర్ ప్లాన్. అయితే ఎక్కడా విస్తరణపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కనీసం మొన్నటి కర్నాటక ఎన్నికల్లో సైతం ప్రభావం చూపలేకపోయారు. ఒడిశా వంటి చోట్ల మాజీ సీఎం గిరిధర్ గొమాంగో వంటి నేతలను చేర్చుకొని రిజర్వులో పెట్టేశారు. వారి జోలికి వెళ్లడం లేదు. ఒక్క మహారాష్ట్రపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. భాషరాని మహారాష్ట్రకు విమానంలో వెళ్లి చక్కర్లు కొట్టి వస్తున్న కేసిఆర్ పక్కనే తెలుగు రాష్ట్రమైన ఏపీలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తుంటే దానికి దురంగా ఉండటం వెనుక అసలు మతలబు ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ మధ్యన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఓకింత రచ్చచేశారు. విశాఖ స్టీల్ ఉద్యమం తలపైకి ఎత్తుకున్నారు. ఎలా ప్రైవేటీకరణ చేస్తారని అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే విశాఖ స్టీల్ బిడ్లలో తెలంగాణ సర్కారు పాల్గొంటుందని.. అవసరమైతే తామే నడిపిస్తామన్న రేంజ్ లో ప్రకటనలు చేశారు. దీంతో ఏపీ ప్రజలు కూడా చాలా ఆతృతగా చూశారు. ఎందుకోకానీ అ అంశం మరుగున పడిపోయింది. కేసీఆర్ అండ్ కో వెనక్కి తగ్గింది. దీంతో ఏపీ ప్రజలకు తత్వం బోధపడింది. గతంలో ఉద్యమ సమయంలో వాడిన భాష, చేసిన యాగి ఏపీ ప్రజలకు గుర్తుంది. అందుకే ఏపీ రాజకీయాలు మనకు సూట్ కావనో.. మరి ఏ కారణమో తెలియదు కానీ.. కేసీఆర్ ఏపీ వైపు చూడడమే మానేశారు.